- అనుమతుల్లేకుండానే ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నది
- సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
- గోదావరి ట్రిబ్యునల్ వరద జలాల ఆధారంగా నీళ్లు కేటాయించలేదు
- ఇప్పటికే నికర జలాల ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తు చేసినం
- వరద జలాల ఆధారంగా ఏపీ ప్రాజెక్ట్ కడితే కేటాయింపుల్లో గందరగోళం
- పీఎఫ్‌ఆర్ క్లియరెన్స్‌లు లేకుండానే డీపీఆర్ తయారీకి టెండర్లు
- కర్నాటక, మహారాష్ట్రలను ఏపీ ప్రేరేపిస్తున్నదని వాదన
- పనులు చేపట్టకుండా ఏపీని, అనుమతులివ్వకుండా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం– నల్లమలసాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర సంస్థలు అడ్డు చెబుతున్నా.. తెలంగాణ సహా గోదావరి నదీ పరివాహక రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా మొండిగా ముందుకుపోతున్న ఏపీని అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం రిట్ పిటిషన్ వేసింది. ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారు చేయకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ సమర్పించిన ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్)కు కేంద్ర సంస్థలు ఆమోదం తెలపకుండా చూడాలని, ప్రాజెక్టుకు అనుమతులివ్వకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 2సీలోని ‘జల వివాదం’ కాదని, ఇది కేవలం గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డుకు సంబంధించిన విషయమని పేర్కొన్నది. కేవలం అష్యూర్డ్ వాటర్స్ (నీటి వాటాలు) ఆధారంగానే ప్రాజెక్టులకు గోదావరి ట్రిబ్యునల్ నీటి కేటాయింపులను చేసిందని, వరద జలాల కాన్సెప్ట్ ప్రకారం చేయలేదని తేల్చి చెప్పింది. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం
అష్యూర్డ్ వాటర్స్ (నికర జలాలు) ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తు చేసిందని, అవి ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్‌లోఉన్నాయని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. కానీ, ఏపీ మాత్రం తమ ప్రాజెక్టులకు అనుమతులు రాకముందే వరద జలాల కాన్సెప్ట్‌తో కొత్తగా భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేసిందని వెల్లడించింది. అష్యూర్డ్ వాటర్స్‌పై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు రాకముందే ఏపీ ప్రభుత్వం వరద జలాల ఆధారంగా ప్రాజెక్టును కట్టాలనుకోవడం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలిపింది. దాని వల్ల తెలంగాణ జల హక్కులకు పెను విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది.
వరద జలాల ఆధారంగా రాష్ట్రాలు తమ ఇష్టారీతిన ప్రాజెక్టులను కట్టుకుంటూ పోతే.. అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో సభ్య రాష్ట్రాలకు సమ న్యాయం దక్కదని పేర్కొన్నది. మరోవైపు 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగానే పెద్ద ప్రాజెక్టులను కట్టడం సాధ్యమవుతుందని, కానీ, ఏపీ మాత్రం పీఎఫ్‌ఆర్‌లో 75 శాతం, 50 శాతం డిపెండబిలిటీ మధ్య వరద జలాలను తరలిస్తామంటూ పేర్కొందని గుర్తు చేసింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా కేటాయింపులుంటేనే ప్రాజెక్టులు కట్టాలని 2017లోనే కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీలు గైడ్‌లైన్స్ ఇచ్చాయని పేర్కొన్నది. ఇటు పీఎఫ్‌ఆర్‌కు సీడబ్ల్యూసీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లేదని, డీపీఆర్ పిలవొద్దని ఈ నెల 4న ఏపీకి సీడబ్ల్యూసీ చెప్పినా వినిపించుకోలేదని తెలిపింది. ఈ నెల 11న టెక్నికల్ బిడ్లు పిలిచిందని, 17న ఫైనాన్స్ బిడ్స్‌కు అవకాశం కల్పించిందని తెలిపింది. మరో వారం రోజుల్లో టెండర్‌ను సంస్థకు అప్పగించే కార్యక్రమానికి తెరలేపిందని పేర్కొన్నది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఏపీ చేపట్టకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని, ఆ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించకుండా ఆర్థిక శాఖ మంత్రిని ఆదేశించాలని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది.
పీఎఫ్ఆర్ క్లియరెన్స్ లేకుండానే పనులు..
ప్రాజెక్ట్ పీఎఫ్‌ఆర్‌కు కేంద్రం నుంచి క్లియరెన్సులు రాకుండానే.. సెగ్మెంట్ –1 పనులను ఏపీ చేపడుతున్నదని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పనులను మొదలుపెట్టాకే పీఎఫ్‌ఆర్‌ను సమర్పించిందని పేర్కొన్నది. పోలవరం –నల్లమలసాగర్ లింక్ పనులు.. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగం కాదని ఈ ఏడాది ఏప్రిల్ 8న నిర్వహించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) మీటింగ్‌లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. ప్రాజెక్ట్ విస్తరణ.. పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ కాంపొనెంట్‌కు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరం..జాతీయ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం పేర్కొన్నది. ఇది కేంద్రం నియంత్రణలో ఉంటుందని, కేంద్రం అనుమతి లేకుండా ఏపీ ప్రాజెక్టును విస్తరించేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
పేరు మార్చి..
వాస్తవానికి పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి జలాలను తరలించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది. కానీ, ఇప్పుడు ఏపీ మాత్రం 200 టీఎంసీలు తరలించేందుకు ప్రయత్నిస్తున్నదని, ఆ తర్వాత 300 టీఎంసీలనూ తరలించేందుకు ఎత్తుగడలు వేస్తున్నదని పేర్కొన్నది. తొలుత పోలవరం –బనకచర్ల పేరుతో ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ.. ఆ తర్వాత ప్రాజెక్ట్ పేరును పోలవరం– నల్లమలసాగర్‌గా మార్చిందని, నవంబర్ 21న టెండర్లనూ పిలిచిందని గుర్తు చేసింది. పోలవరం కుడి కాల్వను 17,500 క్యూసెక్కుల నుంచి 35వేల క్యూసెక్కులకు పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నదని తెలిపింది. మరోవైపు నదీ జలాల విషయంలో కర్నాటక, మహారాష్ట్రలాంటి రాష్ట్రాలనూ గందరగోళానికి గురిచేస్తూ.. ఏపీ వాటిని ప్రేరేపిస్తున్నదని పేర్కొన్నది. కాబట్టి పోలవరం విస్తరణను, పోలవరం– నల్లమలసాగర్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని, ఆ దిశగా ఏపీకి ఆదేశాలివ్వాలని కోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది.
