రణరంగాన్ని తలపించిన జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామం.. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. పోలీసుల లాఠీఛార్జ్.. అసలు ఏమైందంటే..

రణరంగాన్ని తలపించిన జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామం.. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. పోలీసుల లాఠీఛార్జ్.. అసలు ఏమైందంటే..

జగిత్యాల: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అనంతరం.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడిపల్లి గ్రామంలో ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల శేఖర్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గంగుల నగేష్ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. మరో బ్యాలెట్లో ఓట్లు లెక్కించాల్సి ఉండగానే 17 ఓట్లతో ఓడిపోయాడని ఎన్నికల అధికారులు సంతకం తీసుకున్నారని బీజేపీ అభ్యర్థి జక్కుల శేఖర్ ఆరోపించాడు. మరో బ్యాలెట్లో ఓట్లు లెక్కించకుండానే ఓడిపోయినట్లు సంతకం  ఎలా తీసుకుంటారని జక్కుల శేఖర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు వర్గాల మధ్య ఈ విషయంలో వాగ్వాదం జరిగింది. కౌంటింగ్ సెంటర్ గేట్ ముందు కూర్చొని జక్కుల శేఖర్ వర్గం నిరసన వ్యక్తం చేసింది.

సుమారు వందమందికి పైగా కౌంటింగ్ సెంటర్ గేట్ ముందు బైఠాయించి రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పోలీసుల మోహరించడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఓ బీఆర్ఎస్ నేత అండదండలతోనే ఇలా చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు హింసకు దారితీసేలా పరిస్థితులు కనిపించడంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

బ్యాలెట్ బాక్సులు తీసుకువెళ్లే క్రమంలో జక్కుల శేఖర్ వర్గం అడ్డుకుంది. అడ్డుకున్న అభ్యర్థి, అతని భార్యపై పోలీసుల దాడి చేశారని.. బీజేపీ అభ్యర్థి వర్గం పోలీసులపై, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వింది. దీంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీస్ వెహికల్స్ అద్దాలు పగలగొట్టి, పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.