మియాపూర్: పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ బీకే ఎన్‌క్లేవ్ (BK Enclave)లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం తిలకుప్ప ప్రాంతానికి చెందిన స్వామి నాయుడు, శ్రీదేవి దంపతుల కుమారుడు సతీష్ (31).
సతీష్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సతీష్‌కు ఏడాది క్రితమే రవలి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం సతీష్ మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు.
సతీష్ భార్య రవలి సంక్రాంతి పండుగ నిమిత్తం తన సొంత ఊరికి వెళ్ళింది. ఉదయం 10 గంటలైనా గదిలో నుంచి బయటకు సతీష్ బయటకు రాలేదు. గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి అతని తమ్ముడు గది తలుపులు బద్దలు కొట్టాడు.
గదిలో ఫ్యాన్‌కు భార్య చున్నీతో ఉరివేసుకొని వేలాడుతూ సతీష్ కనిపించాడు. అప్పటికే సతీష్ మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి తట్టుకోలేక మృతి చేందినట్లు మియాపూర్ పోలీసులు నిర్ధారించారు.
