హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పార్కులు, కుంటలు, చెరువులు సంరక్షించడమే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా.. ఎన్నో వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే హైడ్రా.. లేటెస్టుగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి నగరవాసులు ఫోన్ ఇన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని బుధవారం (ఫిబ్రవరి 04) ప్రకటనలో తెలిపింది.
ప్రతి శనివారం ఫోన్ ఇన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్న హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ తో నేరుగా మాట్లాడి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ శనివారం నుంచే (ఫిబ్రవరి 07) ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రారంభ అవుతున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నగర ప్రజలకు అవకాశం కల్పించనున్నారు. ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్లు: 040-29565750, 040-29565759 అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, పార్కులు, రహదారులు, ప్రజావసర స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. చెరువుల్లో మట్టి పోయడం వంటి అక్రమాలపై కూడా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే వాటి స్థితిగతులపై తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం లక్ష్యంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
