కరీంనగర్ రూరల్, వెలుగు: నడిరోడ్డుపై కారు పైకెక్కి తల్వార్‌తో బర్త్ డే కేక్ కట్ చేసి హంగామా చేసిన రౌడీ బ్యాచ్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం.. తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్‌లో జనవరి 31 అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ మైనర్ బర్త్ డే పార్టీ జరుపుకుంటున్నారు. కారు పైకెక్కిన ఆ మైనర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి తల్వార్‌తో కేక్ కట్ చేయడంతోపాటు పటాకులు కాలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
ఇదే టైంలో రేకుర్తిలోని సమ్మక్క–సారలక్క జాతరలో వేసిన టెంట్లను ఓ వాహనంలో డి.యుగంధర్, చరణ్ అక్కడే ఉన్న టెంట్ హౌజ్‌కు తీసుకొచ్చారు. టెంట్లను కిందికి దింపుతుండగా సదరు మైనర్, ఫ్రెండ్స్ వారి వద్దకు వెళ్లి.. బూతులు తిడుతూ చరణ్‌పై దాడికి దిగారు. వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన యుగంధర్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
చంపుతామని బెదిరించి చరణ్ వద్ద ఉన్న రూ. 2 వేలు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. యుగంధర్ ఫోన్‌ను నేలకేసి కొట్టారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వారిని చెదరగొట్టి బాధితులను హాస్పిటల్‌కు పంపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్ మేజర్ల అని, మిగతా ఆరుగురు మైనర్లు ఉన్నారని సీఐ వివరించారు.
