టీ20 వరల్డ్ కప్ లో ఇండియా ఓపెనర్లు ఎవరనే దానిపై సస్పెన్స్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో ఓపెనర్లుగా ఇషాన్ కిషాన్ తో పాటు అభిషేక్ శర్మ బరిలోకి దిగాడు. బుధవారం (ఫిబ్రవరి 4) ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ తర్వాత సూర్య మాట్లాడుతూ అభిషేక్, కిషాన్ ఓపెనర్లుగా మేము పరీక్షించానుకుంటున్నాం అని చెప్పాడు. దీంతో వరల్డ్ కప్ తోలి మ్యాచ్ లో అభిషేక్ తో కిషాన్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది.
న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చి ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్ లో కూడా బ్యాట్ ఝులిపించలేకపోయాడు. ఆడిన 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులే చేసి ఓపెనింగ్ స్పాట్ ప్రమాదంలో పెట్టుకున్నాడు. మరోవైపు కిషాన్ రెండేళ్ల తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించి తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఆ తర్వాత ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ లో 42 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కిషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు 10 సిక్సర్లున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ కిషాన్ దంచి కొట్టాడుతున్నాడు. 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔటయ్యాడు. వార్మప్ మ్యాచ్ లోనూ అదరగొట్టిన కిషాన్ వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడం కన్ఫర్మ్ అయింది.
