Under 19 World Cup 2026: కుర్రాళ్ళు కుమ్మేశారు: వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఈజీ విక్టరీ

Under 19 World Cup 2026: కుర్రాళ్ళు కుమ్మేశారు: వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఈజీ విక్టరీ

2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా దూసుకెళ్లింది. బుధవారం (ఫిబ్రవరి 4) హరారే వేదికగా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఏకపక్షంగా జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో దుమ్మురేపి మన జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. భారీ ఛేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68: 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంస క్రికెట్ ఆడితే.. ఓపెనర్ జార్జి (104 బంతుల్లో 115: 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో దుమ్ములేపాడు.

కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏకపక్షంగా సాగిన సెమీస్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 41.1 ఓవర్లలో 313 పరుగులు చేసి గెలిచింది. 

సూర్యవంశీ ధనాధన్: 

311 పరుగుల భారీ ఛేజింగ్ లో ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్ కు 9.3 ఓవర్లలోనే 90 పరుగులు జోడించి ఛేజింగ్ ఈజీ చేశారు. ముఖ్యంగా వైభవ్ కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ 10 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి సూర్య ఔట్ కావడంతో అతని గ్రేట్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది. సూర్యవంశీ ధాటికి టీమిండియా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. వైభవ్ ఇచ్చిన ఆరంభంతో ఇండియా ఛేజింగ్ ఈజీ అయింది. 

ఆరోన్ జార్జ్, ఆయుష్ మాత్రే నిలకడ:
  
ఈ దశలో ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్ కు 114 పరుగులు జోడించిన తర్వాత ఆయుష్ మాత్రే 62 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ దశలో జార్జ్ విహాన్ మల్హోత్రాతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తన సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్ గెలిపించాడు. 

ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్: 

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఖలీద్ అహ్మద్జాయ్, ఉస్మాన్ సదాత్ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించారు. ఖలీద్ అహ్మద్జాయ్ పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ సదాత్ క్రీజ్ లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. తొలి వికెట్ కు 53 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని దీపేష్ దేవేంద్రన్ విడగొట్టాడు. 31 పరుగులు చేసిన ఖలీద్ అహ్మద్జాయ్ ను ఔట్ చేసి ఇండియాకు తొలి వికెట్ అందించాడు. 

షినోజాడా, ఉజైరుల్లా నియాజై సెంచరీల మోత: 

ఈ దశలో ఫైసల్ షినోజాడా, ఉస్మాన్ సదాత్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. రెండో వికెట్ కు 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంత సేపు వేగంగా ఆడడంలో విఫలమైన ఉస్మాన్ సదాత్ 70 బంతుల్లో 39 పరుగువులు చేసి పెవిలియన్ కు చేరాడు. 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత అద్భుతంగా ఆడింది. వచ్చిన మంచి ఆరంభాన్ని ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా ఆడారు. ఈ క్రమంలో ఫైసల్ షినోజాడా తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఉజైరుల్లా నియాజై తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.   

సెంచరీ హీరో ఫైసల్ షినోజాడా (104) ఔటైనా.. చివరి వరకు క్రీజ్ లో ఉండి ఉజైరుల్లా నియాజై కూడా సెంచరీ మార్క్ అందుకొని జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించాడు. ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై  వికెట్ కు ఏకంగా 148 పరుగులు జోడించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది.