Samantha: హడావిడిగా వద్దు.. ఆత్మపరిశీలనతో ముందుకు.. సమంత విజన్ 2026 వైరల్!

Samantha: హడావిడిగా వద్దు.. ఆత్మపరిశీలనతో ముందుకు.. సమంత విజన్ 2026 వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సమంత.. 2026లోకి ఒక సరికొత్త ఆశయంతో, మరింత పరిణతితో అడుగుపెడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, వాటన్నింటినీ ధైర్యంగా అధిగమించి మళ్లీ తన జీవితాన్ని అందంగా మలుచుకుంటోంది. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత, ఆమె ఆలోచనా దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

ప్రశాంతతే ముద్దు!

సాధారణంగా నటీనటులు తమ కెరీర్‌లో పరుగులు పెడుతూ, మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ సమంత మాత్రం 'క్వాంటిటీ కంటే క్వాలిటీ' ముఖ్యం అని చాటిచెబుతోంది. 2026 ఏడాదికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లిస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో 'ఆత్మపరి శీలన, స్థిరంగా పని చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లడం, లక్ష్యా లకు అనుగుణంగా ముందుకు సాగడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, అనుబంధాలు ఏర్పరుచుకోవడం, ఆరోగ్యం పై శ్రద్ద పెట్టడం, కృతజ్ఞతతో ఉండడం.. ఇలా తన ప్రణాళి కను రాసుకొచ్చింది 

నిర్మాతగా కొత్త ప్రయాణం..

సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' చిత్రంతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం నటనకు పరిమితం కాకుండా, ఒక సినిమా మేకింగ్‌లో భాగస్వామి కావడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. దీనితో పాటు రాజ్ & డీకే దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండ్' అనే ఫాంటసీ యాక్షన్ సిరీస్‌లోనూ ఆమె కనిపించబోతోంది.

వ్యక్తిగత జీవితంలో కొత్త వెలుగు

డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో రాజ్ నిడిమోరుతో జరిగిన వివాహం సమంత జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సమయంలో మొదలైన వీరి పరిచయం..  'సిటాడెల్: హనీ బన్నీ' వరకు వచ్చి వివాహ బంధంగా మారింది. ఎక్కడా హంగామా లేకుండా.. చాలా నిరాడంబరంగా ఈ వేడుకను జరుపుకున్నారు.  పరుగు పందెం లాంటి గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే, తనకంటూ ఒక ప్రశాంతమైన ప్రపంచాన్ని నిర్మించుకుంటుంది సమంత.  ప్రస్తుతం సమంత 2026 లక్ష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.