బంగారం, వెండి రేట్లపై బడ్జెట్ ఎఫెక్ట్ ఇదే.. రేట్లు తగ్గుతాయా..? పెరుగుతాయా..?

బంగారం, వెండి రేట్లపై బడ్జెట్ ఎఫెక్ట్ ఇదే.. రేట్లు తగ్గుతాయా..? పెరుగుతాయా..?

గడచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకూ అందరూ ఎదురుచూస్తోంది ఒక్కదాని కోసమే అదే నిర్మలమ్మ బడ్జెట్ బంగారం, వెండి రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నదే. దిగుమతి సుంకాలు పెంచుతారనే ఊహాగానాలు వ్యాప్తి హడావిడిగా షాపింగ్ చేసేలా చాలా మందిని ప్రేరేపించింది. అయితే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ఈ విలువైన లోహాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, దీని వల్ల ప్రభావం ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 

కేంద్ర బడ్జెట్ 2026పై బులియన్ మార్కెట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఆర్థిక మంత్రి గోల్డ్ అండ్ సిల్వర్ దిగుమతి సుంకాల విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగించారు. గతేడాది సుంకాన్ని 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించిన ప్రభుత్వం.. ఈసారి ఆ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. దీనివల్ల దిగుమతిదారులకు, కొనుగోలుదారులకు సుంకాల పరంగా ఎటువంటి కొత్త ఊరట లభించలేదు. ఇదే క్రమంలో దిగుమతులపై టాక్స్ పెంచుతారనే భయాలకు బ్రేక్ పడటం మరో పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. 

ప్రస్తుత పన్నుల పరిస్థితి ప్రస్తుతం బంగారం దిగుమతులపై 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ,1 శాతం అగ్రికల్చర్ సెస్ కలిపి మొత్తం 6 శాతం టాక్స్ విధిస్తున్నారు. వెండి విషయంలోనూ అర్హులైన భారతీయ నివాసితులకు ఇదే 6 శాతం వర్తిస్తుండగా.. ఇతరులకు మాత్రం ఏకంగా 36 శాతం సుంకం విధిస్తున్నారు. వీటికి అదనంగా రెండు లోహాలపై 3 శాతం జీఎస్టీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 20 నుండి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించినా.. అది బంగారం, వెండి ఆభరణాలకు వర్తించదని నిపుణులు స్పష్టం చేశారు.

బడ్జెట్ సమయంలోనే అంతర్జాతీయ పరిణామాలు తోడవడంతో గోల్డ్, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ట స్థాయిల నుండి బంగారం ధర దాదాపు 20 శాతం మేర తగ్గుదలను చూసింది. రూ.లక్ష 82వేల 500 వద్ద ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ.లక్ష 47వేల 800 స్థాయికి పడిపోయింది. వెండి ధరలో పతనం ఇంకా ఎక్కువగా ఉంది. ఏకంగా 36 శాతం క్షీణించిన వెండి, రూ. 4లక్షల 20వేల నుంచి రూ.2లక్షల 65వేల 650కు దిగొచ్చింది. దీనికి కారణాలను పరిశీలిస్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ ఎంపిక కావడంతో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్ కి మొగ్గు చూపడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. బడ్జెట్‌లో సుంకాల తగ్గింపు ఉంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురవ్వడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. రానున్న రోజుల్లో ధరలు మరింత నిలకడగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.