న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు కూడా వెండి, బంగారం ధరలు భారీగా పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి, డాలర్ బలోపేతం కావడంతో వెండి ధర 19 శాతం తగ్గి రూ.3.12 లక్షలకు పడిపోయింది. బంగారం ధర రెండు శాతం తగ్గి రూ.1.65 లక్షల వద్ద ముగిసింది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. కిలో వెండి ధర రూ.72,500 క్షీణించి రూ.3.12 లక్షలకు చేరుకుంది. గురువారం రికార్డు స్థాయిలో రూ.4.04 లక్షలు పలికింది. గత డిసెంబర్ 31న దీని ధర రూ.2.39 లక్షలుగా ఉండగా, పోయిన నెల రూ.73 వేల దాకా పెరిగింది.
బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం రూ.3,500 తగ్గి రూ.1,65,500 కు చేరుకుంది. అంతకుముందు ట్రేడింగ్‌లో 7.6 శాతం తగ్గి రూ.1.69 లక్షల వద్ద ముగిసింది. గత ఏడాది చివరిలో రూ.1,37,700 గా ఉన్న బంగారం ధర.. జనవరిలో రూ.27,800 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి, బంగారం ధరలు కుప్పకూలాయి. శుక్రవారం స్పాట్ సిల్వర్ 27.07 శాతం తగ్గి 84.70 డాలర్ల వద్ద, బంగారం 9.83 శాతం తగ్గి 4,865.35 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. వెండి ధరలు మరింత తగ్గి 60 డాలర్ల వద్ద స్థిరపడవచ్చని పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రాయ్ చురా అన్నారు.
