హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో సాక్ష్యులు, నిందితులు ఇచ్చిన వాంగుల్మాల ఆధారంగా ఇంటరాగేట్ చేశారు. కేసీఆర్ స్టేట్మెంట్ను వీడియో గ్రఫీ ద్వారా రికార్డ్ చేశారు అధికారులు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు విచారణ ముగియడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందని తెలంగాణ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో 2026, ఫిబ్రవరి 1న విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ వయసు దృష్ట్యా ఆయన నివాసంలోనే విచారించేందుకు సిట్ అంగీకరించింది. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో విచారణ స్టార్ట్ అయ్యింది. ఐదుగురు అధికారుల సిట్ బృందం దాదాపు నాలుగున్నర గంటలు ఆయనను ప్రశ్నించింది. ఈ కేసులో సాక్ష్యులు, నిందితులు ఇచ్చిన వాంగుల్మాల ఆధారంగా సిట్ బృందం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. కేసీఆర్ సమాధానాలు అన్నింటినీ అధికారులు వీడియో గ్రఫీ ద్వారా రికార్డ్ చేశారు.
విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ‘సుప్రీం, పెద్దాయన’ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిట్ అధికారులు కేసీఆర్ ముందు ప్రస్తావించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీం, పెద్దాయన అంటే మీరేనా అని కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది.
రిటైర్డ్ అయిన అధికారులను ఎందుకు పదవుల్లో కొనసాగించారు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావుతో మీరెప్పుడైనా మాట్లాడారా.. ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలపై మాట్లాడారు.. ఫోన్ ట్యాపింగ్ డేటాను మీకు ఎవరూ అందజేశారు వంటి అంశాలపై సిట్ అధికారులు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన వీడియోలు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది.
