పరిష్కారం చూపరు.. పక్కనపెట్టుడే! ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే

పరిష్కారం చూపరు.. పక్కనపెట్టుడే! ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే
  • పరిష్కారం చూపరు.. పక్కనపెట్టుడే!
  • ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే 
  • రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన మొత్తం అప్లికేషన్లు 9.15 లక్షలు
  • పరిష్కారం అయినవి: 5 శాతం
  •  సమస్యలున్న సర్వే నంబర్లు14.09 లక్షలు
  • పరిష్కారం అయినవి 71వేలు
  • అధికారుల లాగిన్లలో పెండింగ్ అప్లికేషన్లు: 85,069 
  • సాదాబైనామాల పరిష్కారం అయినవి 10%

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ​ప్రభుత్వం పోయి కాంగ్రెస్​ సర్కారు వచ్చింది.. ధరణి పోయి భూభారతి వచ్చింది.. కానీ రైతుల భూసమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదు. ఇందుకు రెవెన్యూ అధికారుల పనితీరే కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా దరఖాస్తులు తీసుకోవడం, సీఎంలు, మంత్రులు సీరియస్​కాగానే హడావిడిగా కొన్నింటిని పరిష్కరించడం, మిగిలినవన్నీ  పక్కనపెట్టడం రెవెన్యూ యంత్రాంగానికి పరిపాటిగా మారింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. మొత్తం 14,09,602 సర్వే నంబర్లకు సంబంధించిన భూ సమస్యలపై 9,15,579 దరఖాస్తులు వచ్చాయి.

వీటిలో  కేవలం 71,385 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు మాత్రమే  పరిష్కారానికి నోచుకున్నాయి. అంటే కేవలం 5 శాతానికి అటూఇటుగా మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగిలినవన్నీ పక్కనపెట్టేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలు, చర్చల ద్వారా, రికార్డుల సవరణల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ అది చేయలేక  ఎప్పట్లాగే సాంకేతిక, న్యాయపరమైన కారణాలను చెప్తూ అప్లికేషన్లన్నీ బుట్టదాఖలు చేశారనే విమర్శలున్నాయి. దీంతో ఎప్పట్లాగే లక్షలాది మంది రైతులు, భూ యజమానులు మళ్లీ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.  


నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టిన్రు.. 


2025 ఏప్రిల్‌‌14న భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి దశలో అదే ఏడాది ఏప్రిల్‌‌ 17 నుంచి  ఏప్రిల్ 30 వరకు పైలెట్​ ప్రాజెక్టుగా 4 మండలాల్లో, రెండో దశలో మే 5 నుంచి మే 20 వరకు 28 మండలాల్లో,  మూడో విడతలో జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో  రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు.  భూ సమస్యలను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించడం కంటే సాంకేతిక కారణాలు, అప్లికేషన్లలో లోపాలను సాకుగా చూపి తిరస్కరించడానికే అధికారులు ప్రాధాన్యమిచ్చారనే  విమర్శలు వచ్చాయి. 


ఆయా జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం మొత్తం 14,09,602 సర్వే నంబర్లకు సంబంధించిన వివాదాల్లో ఏకంగా 8,27,177  సర్వే నంబర్లకు సంబంధించిన అర్జీలను తిరస్కరించారు.  అంటే దాదాపు 58 శాతానికి పైగా  వివిధ కారణాలతో పక్కన పడేశారు. మరో 5 లక్షల సర్వే నంబర్లపై అర్జీలను పెండింగ్​పెట్టారు. ఈ అప్లికేషన్లు అధికారుల వద్ద ఉన్నాయో? లేవో? అనేది తెలియని పరిస్థితి. కేవలం 71,385 సర్వే నంబర్లకు సంబంధించిన అర్జీలు మాత్రమే పరిష్కారమయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో  6,374 , కామారెడ్డిలో 7,308, నిజామాబాద్‌‌లో 6,269,  ములుగులో 5,316 సర్వే నంబర్లకు సంబంధించి  సమస్యలను పరిష్కరించగా,  మిగిలిన  జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.  ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 90,995 సర్వే నంబర్లు, సిద్దిపేటలో 83,999, జయశంకర్ భూపాలపల్లిలో 66,575, మెదక్‌‌లో 55,453, కరీంనగర్‌‌లో 51,929 సర్వే నంబర్లకు సంబంధించిన అర్జీలు నిర్దాక్షిణ్యంగా పక్కనపడేశారు. ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 57 సర్వే నంబర్లు, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 77, నారాయణపేటలో 294, సూర్యాపేటలో 369  వరంగల్ జిల్లాలో 559 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయి.  కాగితాలపై రెవెన్యూ సదస్సులు విజయవంతమయ్యాయని చెప్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు కూడా అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.

చాలా గ్రామాల్లో క్షేత్రస్థాయి విచారణ  చేపట్టకుండా కేవలం డిజిటల్ రికార్డుల ఆధారంగా  దరఖాస్తులను తిరస్కరించారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏండ్ల తరబడి అనుభవంలో ఉన్న భూములకు కూడా సరైన పత్రాలు పొందలేక, ప్రభుత్వ పథకాలు వర్తించక, బ్యాంకు రుణాలు అందక సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


5.11 లక్షల సర్వే నెంబర్లు పెండింగ్​


ఒకవైపు భారీగా తిరస్కరించిన అర్జీలు ఒకెత్తయితే, మరోవైపు అసలు ఎటూ తేల్చకుండా పెండింగ్‌‌లో పడేసిన దరఖాస్తుల సంఖ్య కూడా కొండలా పేరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,11,040 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు పెండింగ్ జాబితాలోనే మూలుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 77,400 సర్వే నంబర్లు, వరంగల్‌‌లో 51,924, సూర్యాపేటలో 46,844, మహబూబాబాద్‌‌లో 44,300,  హనుమకొండ జిల్లాలో 33,003 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. సదస్సులు నిర్వహించి నెలలు గడుస్తున్నా తమ దరఖాస్తు పరిస్థితి  ఏమిటో తెలియక రైతులు ప్రతిరోజూ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.  పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన గడువు విధించకపోవడంతో ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.

పై అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు రెవెన్యూ యంత్రాంగంలో ఏండ్లుగా గూడుకట్టుకున్న  అలసత్వం, జవాబూదారీతనం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో దరఖాస్తు ఏ కారణంతో తిరస్కరిస్తున్నారో రైతులకు స్పష్టంగా వివరించే  వ్యవస్థ సైతం లోపించింది. అర్జీ తిరస్కరణకు గురైన విషయాన్ని మెసేజ్ రూపంలో పంపడం తప్ప, తదుపరి  ఎక్కడ అప్పీల్​చేసుకోవాలి? ఏ పత్రాలు జత చేయాలి? అనే విషయంలో అధికారులు ఎలాంటి మార్గదర్శనం చేయడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

 సాదా బైనామాలు 10 శాతం కూడా  పరిష్కారం కాలే 


రాష్ట్రవ్యాప్తంగా సాదాబైనామాల (తెల్లకాగితాల ఒప్పందాల)కు సంబంధించి  
9 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే ఇప్పటివరకూ అధికారులు 10 శాతం కూడా పరిష్కరించలేకపోయారు.  ‘భూభారతి’ అమల్లోకి వచ్చాక అఫిడవిట్ నిబంధనల్లో మార్పులు చేసి, పరిష్కార బాధ్యతలను ఆర్డీవో  పరిధికి అప్పగిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినా ముందుకు కదలడం లేదు.  మరోవైపు  నకిలీ పత్రాలు, కోర్టు వివాదాలు,  దేవాదాయ, అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన దరఖాస్తులను చట్టప్రకారం ఆమోదించలేమని, మిగిలిన పెండింగ్ దరఖాస్తులను సమగ్ర విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం గమనార్హం. 

భూ భారతి పోర్టల్‌‌లోని దరఖాస్తులూ పెండింగే! 


ఒకవైపు రెవెన్యూ సదస్సుల్లో పెట్టుకున్న దరఖాస్తుల పరిస్థితి ఇలా ఉంటే..  భూ భారతి ద్వారా ఆన్‌‌లైన్‌‌లో రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తూ పెట్టుకుంటున్న అప్లికేషన్లను సైతం అధికారులు ఇష్టారీతిన రిజెక్ట్ చేస్తున్నారు. భూభారతి  పోర్టల్‌‌లో నమోదైన దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్​ కలెక్టర్​, కలెక్టర్​..ఇలా వివిధ స్థాయిల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఆయాచోట్ల ముందుకు కదలని  వేలాది అర్జీలు నిర్ణీత కాలపరిమితి దాటిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ రెవెన్యూ అధికారుల లాగిన్లలో మొత్తం 85,069 దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇందులో 60 రోజులలోపు వ్యవధి కలిగినవి 39,076 దరఖాస్తులు కాగా, నిర్దేశిత 60 రోజుల కాలపరిమితి దాటిపోయినవి ఏకంగా 45,993 అప్లికేషన్లు (దాదాపు 54 శాతానికి పైగా) ఉండడం రెవెన్యూ శాఖ పనితీరుకు అద్దం పడుతున్నది.