టెస్సెరాక్ట్ భూ కేటాయింపులపై కేటీఆర్ ఆరోపణలు అబద్ధం : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు

టెస్సెరాక్ట్ భూ కేటాయింపులపై కేటీఆర్ ఆరోపణలు అబద్ధం : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు
  • రూల్స్‌‌ ప్రకారమే ఆ కంపెనీకి భూకేటాయింపు: మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు
  •     ఆ సంస్థతో సీఎం సోదరులకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: టెస్సెరాక్ట్ సంస్థకు భూ కేటాయింపులపై బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు భూ కేటాయింపులు చేశారంటూ కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్‌‌చాట్‌‌ చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ఎకర భూమి రూ.90 లక్షలకు ఇస్తే.. తమ ప్రభుత్వం రూ.కోటిన్నరకు ఇచ్చామని, దీనిపై ఏర్పాటు చేసిన బోర్డు నిర్ణయించిన దానికంటే రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకటి టెస్సెరాక్ట్ కంపెనీ అని, ఈ కంపెనీకి అన్ని నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. ఆ సంస్థతో సీఎం రేవంత్‌‌ సోదరులకు ఎలాంటి సంబంధం లేదని, సోషల్‌‌ మీడియాలో పెట్టే పోస్టుల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఐదు ఎకరాల్లో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్టు కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇది పూర్తిగా అర్థరహితమైన ఆరోపణ అని శ్రీధర్ బాబు కొట్టిపారేశారు.

పీఎం- ఏక్తామాల్ టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగాయని, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారమే మాల్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. పీపీపీ విధానంలోనే పీఎం- ఎక్తామాల్ టెండర్లు జరిగాయని, ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్ని భూకేటాయింపులపై విచారణ చేయించి, అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. బీఆర్‌‌ఎస్‌‌ పదేళ్ల పాలనలో పలు కంపెనీలకు ముడుపులు తీసుకునే భూములు ఇచ్చారా... తక్కువ ధరకు భూములను ఇచ్చిన దానిపై కూడా కేటీఆర్‌‌ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు పరిశ్రమలు రావద్దనే ఎజెండాతో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.