చొప్పదండిని సస్యశ్యామలం చేస్తా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండిని సస్యశ్యామలం చేస్తా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • నారాయణపూర్ ప్రాజెక్టును అడ్డుకుంటూ బీఆర్ఎస్ నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్

గంగాధర, వెలుగు: నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తిచేసి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేసి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతామని కరీంనగర్​జిల్లా చొప్పదండి  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్​లోని నారాయణపూర్ కుడికాలువను మంగళవారం ఇరిగేషన్​అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 

కాలువ పనులు 90 శాతం ఎప్పుడో పూర్తయ్యాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్ట్, కాలువలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టానని.. నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూసేకరణకు రూ.23.50 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రిజర్వాయర్ అభివృద్ధి..  కుడి, ఎడమ కాలువల పూర్తికి మరో రూ.20 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు ఇవ్వడానికి తాము ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటూ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా నారాయణపూర్ ప్రాజెక్టుతో పాటు, అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తిచేసి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్​సీఈ సుమతీదేవి, ఎస్​ఈ సంతు ప్రకాశ్, ఈఈ బాలకృష్ణ, డీఈఈ, ఏఈఈలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, నాయకులు పాల్గొన్నారు.