చేతిరాత మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది..కాలిగ్రఫీ ప్రయోజనాలు ఎన్నో..

చేతిరాత మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది..కాలిగ్రఫీ ప్రయోజనాలు ఎన్నో..

అందంగా  చేతిరాత  రాయడం ఓ అద్భుత కళ.  విలక్షణమైన  చేతిరాత  ఒక  కళాత్మక వ్యక్తీకరణ.  అందమైన అక్షరాల పొందికను వివరించే విజ్ఞానాన్ని ‘కాలిగ్రఫీ’  లేదా ‘చేతిరాత కళ’ లేదా ‘అక్షర రూపకల్పన’ అని పిలుస్తున్నాం. చేతిరాత  ఒక  ప్రత్యేక నైపుణ్యం. చేతిరాతతో  మెలకువలను తెలుసుకుంటూ, మెరుగుపరుచుకోవడం నిరంతరంగా కొనసాగే ప్రయత్నం.  నేటి డిజిటల్‌‌ యుగంలో లుక్‌‌ కల్చర్‌‌ పెరిగి రైటింగ్‌‌ కల్చర్‌‌ తగ్గుతోంది. 

చేతిరాత పట్ల అవగాహన పెంచడానికి కార్యశాలలు, ఆన్‌‌లైన్‌‌ కార్యక్రమాలు, కొత్త రాత శైలిలను నేర్చుకోవడం, అందమైన రాత కోసం సాధన చేయడం కొనసాగాలి. సాధారణంగా మంచి చేతిరాతతో పునాది పాఠశాల స్థాయిలోనే జరుగుతుంది. కుదురుగా అక్షరాలు రాయడానికి పాఠశాల స్థాయిలో డబుల్‌‌ రోల్‌‌ నోట్‌‌ బుక్స్‌‌లో రాయడం నేర్పిస్తారు. 

కా లిగ్రఫీ నైపుణ్యం పట్ల ప్రాధాన్యాన్ని అవగాహన పరచడం, చేతిరాతను మెరుగుపరుచుకోవడం, అందమైన చేతిరాత పట్ల ఆసక్తిని కనబరచడం లాంటి ముఖ్యమైన అంశాలను చర్చించే వేదికగా ప్రతి ఏటా ఆగస్టు 2వ బుధవారం రోజు, అనగా 12 ఆగస్టున ప్రపంచ కాలిగ్రఫీ దినోత్సవం (వరల్డ్ కాలిగ్రఫీ డే) పాటించడం ఒక ఆచారంగా వస్తున్నది.

ప్రపంచ కాలిగ్రఫీ రోజు ముఖ్యంగా విద్యాలయాల్లో అందమైన చేతిరాత పోటీలను నిర్వహించడం జరుగుతుంది. చేతిరాత ప్రక్రియలో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను ప్రశంసించడం ఒక మంచి సంప్రదాయం. అక్షరాలకు సొగసులు అద్దడం,  విలక్షణ ఆకర్షణను జోడించడం అందరి వల్ల కాదు. అది ఒక ప్రత్యేక నైపుణ్యం అని గుర్తించాలి. 

చేతిరాతను మెరుగుపరుచుకునే చిట్కాలు

అందంగా చేతిరాత రాయడంలో మనం కూర్చునే విధానం కూడా ప్రభావితం చేస్తుంది. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చొని, కాళ్లు నేలకు ఆనించి రాయడం వల్ల చేతిపై ఒత్తిడి తగ్గి అక్షరాలు కుదురుగా రాయడానికి ఉపకరిస్తుంది.  పెన్‌‌ను పట్టుకునే విధానం కూడా కాలిగ్రఫీలో ముఖ్యం అని గమనించాలి. చూపుడు వేలు, బొటన వేలు మధ్య పెన్నును పట్టుకోవాలి. పెన్నులను గట్టిగా పట్టుకోవద్దు. మనం రాసే అక్షరాల సైజు కూడా చేతిరాతను నిర్ణయిస్తుంది. 

పేజీకి నాలుగు వైపులా మార్జిన్‌‌ తీసుకోవాలి.  మరీ చిన్నగా లేదా మరీ పెద్దగా అక్షరాలు రాయవద్దు.  ప్రతి పేజీలో 15 వరుసలు మాత్రమే రాయడం ఉత్తమ మార్గం. అభ్యాసం వల్ల చేతిరాత సులభంగా మెరుగుపడుతుంది.  చేతిరాత బాగుంటే ఊహించిన దాని కన్న అధిక మార్కులు వస్తాయి. చేతిరాత బాగా రాసేవారి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది.  

విద్యార్థులు, యువత ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తే చేతిరాత సులభంగా మెరుగుపడుతుంది. చదువుతో పాటు చేతిరాతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.  మంచి మార్కులు పొందడానికి సమాధానాలను స్పష్టంగా, అందంగా, కుదురుగా రాయడం చాలా ముఖ్యం. అందమైన చేతిరాత ఉంటే కెరీర్‌‌ కూడా బాగుంటుంది.  చేతిరాత మన జీవితాన్ని మార్చి వేస్తుందంటే అతిశయోక్తి కాదు.

కాలిగ్రఫీ ప్రయోజనాలు ఎన్నో.. 

కాలిగ్రఫీ అంటే కేవలం అందంగా రాయడం మాత్రమే కాదు. దీని వల్ల ఏకాగ్రత, మనసుకు ప్రశాంతత, జ్ఞాపకశక్తి, మెదడు చురుకుదనం, సృజనశీలత, క్రమశిక్షణ పెరగడం  జరుగుతుంది. అందమైన లిపి చదివితే తేలికగా అర్థం అవుతుంది. అందంగా రాయడం వల్ల మనకు మంచి గుర్తింపు వస్తుంది. చేతిరాతను బట్టి మన వ్యక్తిత్వాన్ని సైతం అంచనా వేస్తారు. అందమైన చేతిరాతతో పరీక్షల్లో ఉత్తమ మార్కులు పొందవచ్చు.  మన చేతిరాత కూడా మన విద్యాభ్యాసంలో కీలక పాత్రను పోషిస్తున్నది.

మంచి చేతిరాత ఉన్న విద్యార్థుల పేపర్లను ఉపాధ్యాయుడు ఆసక్తిగా చదివి మంచి మార్కులు లేదా గ్రేడ్స్‌‌ వేస్తారు. చేతిరాతను మెరుగుపరచడానికి చిన్నతనంలోనే ప్రత్యేక శిక్షణను ఇప్పించాలి. అక్షరాలు సరైన పరిమాణంలో అందంగా రాయడం, పదానికి పదానికి మధ్య గ్యాప్ వదలడం, మార్జిన్‌‌ ఇవ్వడం, ఒకే లైన్‌‌లో రాయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.