- హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ సంఘీభావం
ఉప్పల్, వెలుగు: ‘ధరలు పెరుగుతున్నా.. మా స్టైపెండ్ పెరగడం లేదు.. రూ.13 వేలతో చదువుకుంటూ ఎలా బతికేదని’ ఆయుష్ వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టైపెండ్ పెంపు కోసం రామంతాపూర్‌లోని జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో విద్యార్థులు చేపట్టిన నిరసన మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది. వారికి తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్ నిరసన శిబిరానికి వచ్చి, మద్దతు తెలిపారు. రెండేళ్లకోసారి 15 శాతం స్టైపెండ్ పెంచాలన్న నిబంధనఅమలు కావడం లేదన్నారు. 2023లో ధర్నా చేస్తే అప్పటి ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంచిందని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఆయుష్ వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. స్టైపెండ్ పెంచకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
