ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగంగా చర్యలు

ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగంగా చర్యలు

ఖమ్మం టౌన్, వెలుగు​: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుకు సంబంధించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌‌‌‌‌‌‌‌తో కలిసి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి చట్టం అమలుపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల నిర్వహించే సివిల్ రైట్స్ డే కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలో కనీసం 100 మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

కోర్టుల్లో ఉన్న కేసులను సమర్థవంతంగా ఫాలోఅప్ చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ 2026లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 62 ఫిర్యాదులు అందగా, విచారణలో 9 తప్పుడు ఫిర్యాదులుగా తేలాయని, 53 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి ఛార్జ్‌‌‌‌‌‌‌‌షీట్లు దాఖలు చేస్తున్నామన్నారు. అంతకుముందు సీపీ ఖమ్మం పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. నూతన కార్యవర్గ సభ్యులు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలని, సిబ్బంది సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు.