సుప్రియా సూలే కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌‌‌‌‌‌‌‌లో ఒకే వేదికపై రాహుల్ గాంధీ, అమిత్ షా

సుప్రియా సూలే కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌‌‌‌‌‌‌‌లో ఒకే వేదికపై రాహుల్ గాంధీ, అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్‌‌‌‌‌‌‌‌పీ) అధినేత శరద్‌‌‌‌‌‌‌‌పవార్‌‌‌‌‌‌‌‌ మనవరాలు, ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి, సారంగ్‌‌‌‌‌‌‌‌ల వెడ్డింగ్ రిసెప్షన్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీలో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. అయితే, ఈ వేడుకలో అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. రాజకీయ రంగంలో ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకే ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌లో కనిపించారు.

పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ విధానాలపై, విద్యార్థుల ఆందోళనల అణచివేతపై తీవ్ర స్థాయిలో పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న ఈ ఇద్దరు దిగ్గజ నేతలు.. వెడ్డింగ్ రిసెప్షన్‌‌‌‌‌‌‌‌లో చాలా ప్రశాంతంగా నూతన దంపతులను కలిసేందుకు తమ వంతు కోసం వెయిట్ చేశారు. సుప్రియా సూలే స్వయంగా అమిత్ షాను వేదికపైకి ఆహ్వానించగా.. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి బొకే అందజేశారు. ఆ వెంటనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా వేదికపైకి చేరుకున్నారు.

సుప్రియా సూలే చొరవతో నూతన వధూవరుల మధ్యలో సోనియా గాంధీ.. ఇరువైపులా రాహుల్, ప్రియాంక గాంధీలు నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు.ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ, సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పీటీ ఉషా వంటి ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు ఒకే టేబుల్ వద్ద కూర్చుని సరదాగా ముచ్చటించుకున్నారు.

సోనియా గాంధీ స్వయంగా అఖిలేష్ యాదవ్ కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. రాజకీయ పార్టీలు, సిద్ధాంతాలు వేర్వేరు అయినప్పటికీ..నేతలు మనస్పర్థలను విడనాడి ఒకే వేడుకలో కలిసి పాల్గొన్న ఈ అరుదైన దృశ్యం భారతీయ రాజకీయాల ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది.