సాంస్కృతిక మార్పిడితోనే దేశాల మధ్య స్నేహం బలోపేతం : స్పెషల్ సీఎస్ వాణీప్రసాద్

సాంస్కృతిక మార్పిడితోనే  దేశాల మధ్య స్నేహం బలోపేతం : స్పెషల్ సీఎస్ వాణీప్రసాద్

హైదరాబాద్, వెలుగు: దౌత్యపరమైన చర్చల వల్ల మాత్రమే కాకుండా, ప్రజల మధ్య సంబంధాలు, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, పర్యాటక రంగాల మార్పిడి ద్వారానే  ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతుందని స్పెషల్​ సీఎస్​ వాణీ ప్రసాద్​ పేర్కొన్నారు. పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో  భారత్, -ఫ్రాన్స్ మధ్య విద్యా, వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథమ్‌లో  ఇండో–-ఫ్రెంచ్ కో ఆపరేషన్‌పై ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ ముఖ్య అతిథిగా హాజరై ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వాణీ ప్రసాద్ మాట్లాడుతూ.. భారత్‌లోని సుసంపన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, వంటకాలను ఫ్రాన్స్‌కు పరిచయం చేస్తూనే.. ఫ్రెంచ్ జీవనశైలిని భారతీయులు అర్థం చేసుకునేలా రెండువైపులా సాంస్కృతిక మార్పిడి జరగాలన్నారు. నిథమ్ విద్యార్థులు, అధ్యాపకులు అంతర్జాతీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మార్క్ లామీ మాట్లాడుతూ.. భారత్‌తో ఆర్థిక, విద్యా, సాంస్కృతిక సంబంధాలను విస్తరించుకునేందుకు ఫ్రాన్స్ ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఏరోస్పేస్‌, ఫార్మాస్యూటికల్స్‌, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లో ఫ్రెంచ్ పెట్టుబడులు, భాగస్వామ్యాలకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారిందని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో  నిథమ్​ డైరెక్టర్​ ప్రొఫెసర్ వి. వెంకటరమణ  పాల్గొన్నారు.