డిసెంబర్ నాటికి మూడు పబ్లిక్ స్కూళ్లు రెడీ కావాలి : నవీన్ నికోలస్

డిసెంబర్ నాటికి మూడు పబ్లిక్ స్కూళ్లు రెడీ కావాలి : నవీన్ నికోలస్
  •     పైలట్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: నవీన్ నికోలస్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) పైలట్ ప్రాజెక్టు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారులను ఆదేశించారు. మంచాల, వంగూరు, పోల్కంపల్లి పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ ప్రగతిపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో వేగం పెంచడమే కాకుండా, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. 

విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పబ్లిక్ స్కూళ్లకు అవసరమైన ఫర్నిచర్‌‌ను జైళ్ల శాఖ నుంచి సమకూర్చుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. చర్లపల్లి, చంచల్‌‌గూడ జైళ్లలో ఖైదీలు తయారు చేసే నాణ్యమైన బెంచీలు, డెస్క్‌‌లు, టేబుళ్లను వాడాలని నికోలస్ సూచించారు. ఇందుకోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి స్కూల్ హెచ్ఎం వెంటనే ఇండెంట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. బిల్డింగ్ పనులు పూర్తయ్యే సమయానికి ఫర్నిచర్ కూడా రెడీగా ఉండాలని, అప్పుడే అకడమిక్ పరంగా ఇబ్బందులు ఉండవని తెలిపారు. 

బిల్లుల సమస్య రాకుండా చూస్తం: గణపతి రెడ్డి

నిధుల విడుదల, బిల్లుల చెల్లింపు విషయంలో కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎడ్యుకేషన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. ఎంబీ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. నిధుల సమస్య కారణంగా పనులు ఆగకూడదని, క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని హెచ్ఎంలకు సూచించారు. విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం ఈ మూడు స్కూళ్ల పనులను ప్రత్యేంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈ సమీక్షలో విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేశ్, జోష్నా శివారెడ్డి, పీఎల్  విశ్వేశ్వర్ రావు, ఆయా స్కూళ్ల హెచ్​ఎంలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.