హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కమిషనర్ బి.కిషన్ తీరుపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు, శానిటేషన్ తదితర సమస్యలపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అజెండా తయారుచేసి పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం నిర్వహించిన జనరల్‌బాడీ మీటింగ్‌ను అన్ని పార్టీల కౌన్సిలర్లు బహిష్కరించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ హుజూరాబాద్ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్నిస్తామని, అవసరమైతే పోరాడుతామని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి పనులపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం, పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
