హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో పలు ప్రభుత్వ ఆఫీసుల్లో మంగళవారం బోనాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొని బోనమెత్తారు. అలాగే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కమిషనర్ సృజన, అడిషనల్కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సెల్ప్ హెల్ప్ గ్రూప్ మహిళలు 51 బోనాలను అమ్మవారికి సమర్పించారు.
లష్కర్ మహంకాళికి మారు బోనం
పద్మారావునగర్,: సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జోగినీలు మంగళవారం మారు బోనం సమర్పించారు. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ప్యారడైజ్ నుంచి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల బోనాల జాతరలో జోగినీలకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, కార్యక్రమానికి జోగిని శ్యామల హాజరుకాలేదు. దీనిపై ఆమెను వివరణ కోరగా.. నో కామెంట్స్ అనడం కొసమెరుపు.
