కరీంనగర్ సిటీ, వెలుగు: భూకబ్జాలు, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ సిటీలో ముఖరంపురలోని తన ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో కరీంనగర్ బల్దియాలో కొందరు కార్పొరేటర్లు కబ్జాలకు పాల్పడ్డారని, ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ ప్రజలను పరేషాన్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
బాధ్యత గల పదవిలో ఉన్న బండి సంజయ్ కరీంనగర్‌లో జరుగుతున్న దాడులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై స్వయంగా బీజేపీ కార్పొరేటర్లు దాడికి దిగినట్లు గుర్తుచేశారు. కిసాన్ నగర్‌లో బీజేపీకి కార్పొరేటర్‌కు చెందిన వ్యక్తులు ఏకంగా కత్తులు, బీరు సీసాలతో దాడులకు పాల్పడ్డారని ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజ్, కార్పొరేటర్ నర్సింగం, లీడర్లు పర్వతం మల్లేశం, జగన్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
