- అనుకుంట గ్రామంలో పోలీస్ బందోబస్తు నడుమ షురూ
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు భూ సేకరణ కోసం మంగళవారం అధికారికంగా భూ సర్వే ప్రారంభమైంది. ఎయిర్ పోర్టుకు అవసరమైన భూముల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2,278 కోట్లు మంజూరు చేసింది. 2,009 ఎకరాల భూమి సేకరించనుండగా, అందుకు సంబంధించి సర్వే బృందాలు సర్వే చేపట్టాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాల మధ్య అనుకుంట గ్రామ శివారులోని సర్వే నంబర్ 16 నుంచి 31 వరకు అధికారులు సర్వే నిర్వహించారు.
ఏ ప్రాంతం వరకు భూములు అవసరం ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భూముల కొలతలు తీసుకున్నారు. సర్వే చేస్తున్నప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం మూడు బృందాలు సర్వే చేయగా, ఆదిలాబాద్, నిజామాబాద్ కు చెందిన సర్వేయర్లు పాల్గొన్నారు. కాగా భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
