‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వాల్సిందే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

‘పాలమూరు-రంగారెడ్డి’కి  జాతీయ హోదా ఇవ్వాల్సిందే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జాతీయ హోదా ఇవ్వలేమంటూ కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్రాష్ట్ర అంశాలు, కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్–-2, న్యాయవివాదాల పేరిట ప్రాజెక్టును పక్కనబెట్టడం సరికాదని చెప్పారు. 

గతంలో తాము అధికారంలోకి వస్తే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి జాతీయ హోదాతోపాటు తగినంత నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందన్నారు.