జీసీపీఈలో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జీసీపీఈలో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • 17 నుంచి ఇన్ సర్వీస్ టీచర్ల నుంచి దరఖాస్తులు 

హైదరాబాద్, వెలుగు: నగరంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (జీసీపీఈ) ఖాళీగా ఉన్న 22 లెక్చరర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఫారిన్ సర్వీస్  నిబంధనల మేరకు, డెప్యుటేషన్ ప్రాతిపదికన తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు. గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో పీడీలుగా పనిచేస్తున్న వారికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు కొనసాగుతుంది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి ఈ నెల 28న ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ఇంటర్వ్యూలు  డెమోన్స్ట్రేషన్ నిర్వహించే తేదీలను విద్యాశాఖ త్వరలోనే ప్రకటించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మరియు దరఖాస్తు సమర్పణ కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ని సందర్శించాలని అధికారులు సూచించారు.