హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 14న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, సంక్షేమ పథకాల విస్తరణ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలతో పాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. భూములు ఇచ్చే రైతులకు అభివృద్ధి చేసిన భూమిలో 60 శాతం తిరిగి ఇవ్వాలని ప్రతిపాదించారు. మిగిలిన 40 శాతం భూమిని హెచ్‌ఎండీఏ, టీజీఐసీసీ వంటి ప్రభుత్వ సంస్థలు తమ దగ్గర ఉంచుకుంటాయి.
ఈ భూమిని విక్రయించి వచ్చిన డబ్బును మౌలిక వసతుల అభివృద్ధికి వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. రాజ్యసభ, శాసనమండలికి పోటీ చేసే వయస్సును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేయనున్నారు. ఇందుకోసం ఆగస్టు 17 లేదా 18న ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 41 లక్షల మందికి పింఛన్లు అందుతుండగా.. మరో 2.25 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గృహజ్యోతి పథకాన్ని మరో 3-4 లక్షల కుటుంబాలకు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి పథకాన్ని మరో 5 లక్షల కుటుంబాలకు విస్తరించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల కోసం ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవర్ ప్రాజెక్టుల పనులపై అవసరమైన నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు.
