ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి.. MGBS-చాంద్రాయణగుట్ట రూట్‌‌లో వెంటనే టెండర్లు పిలవాలి: సీఎం రేవంత్‌‌ 

ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి.. MGBS-చాంద్రాయణగుట్ట రూట్‌‌లో వెంటనే టెండర్లు పిలవాలి: సీఎం రేవంత్‌‌ 
  • ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట రూట్‌‌లో వెంటనే టెండర్లు పిలవాలి: సీఎం రేవంత్‌‌
  • రద్దీకి తగ్గట్టుగా అదనపు మెట్రో కోచ్‌‌లను కొనుగోలు చేయాలని ఆదేశం
  • హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష
  • డిసెంబర్‌‌‌‌లో గ్లోబల్ సమిట్‌‌కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సూచన

హైదరాబాద్, వెలుగు:  పాతబస్తీ మెట్రో పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌‌ రెడ్డి  ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌‌‌‌లో రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా కొత్త మెట్రో కోచ్‌‌లను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

ఫేజ్–-2 లో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ నిర్మాణంలో ప్రస్తుత టెక్నాలజీ వినియోగంపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌‌లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన కొలిక్కి తెచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మెట్రోలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున కొత్త కోచ్‌‌ల కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌ లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’ సన్నాహకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేలా సమిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. వ్యాపార రంగంలో గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ సమిట్‌‌‌‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. 

నిరుడు వచ్చిన పెట్టుబడులు, వాటి ప్రస్తుత పురోగతిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించిన సీఎం.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేశ్‌‌‌‌ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.