- రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మీటింగ్ నిర్వహిస్తున్నరు: కేటీఆర్
- అజెండా నుంచి అనుమతుల రద్దు అంశాన్ని తొలగించకపోతే జల ఉద్యమం చేపడతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఏడు సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతుంటే.. ఆ అంశాన్ని జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్వహించబోతున్న ఆ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశాన్ని బహిష్కరించడంతోపాటు అజెండా నుంచి అనుమతుల రద్దు అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో జల ఉద్యమాన్ని చేపడతామని, అవసరమైతే జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు.
మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కెన్-బెత్వా, పోలవరం, అప్పర్ భద్రలాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తుండగా, తెలంగాణలోని పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పినా ఒక్క తెలంగాణ ఎంపీ కూడా ప్రశ్నించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ‘సర్’ వల్ల అర్హులైన ఒక్కరి ఓటు కూడా పోకుండా చూడాలని ఆ పార్టీ కమిటీకి కేటీఆర్ పిలుపునిచ్చారు.
టెస్సెరాక్ట్ భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరగాలి..
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి భూముల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కంపెనీ వివరాలు, దాని మూలధనం, ఉద్యోగుల సంఖ్య, ఆఫీస్ అడ్రస్, కంపెనీ చైర్మన్ వ్యవహారం, ప్రభుత్వ భూమి కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తే ఇందులో భారీ కుంభకోణం జరిగినట్టు అర్థమవుతున్నదన్నారు.
కంపెనీ వెబ్సైట్లో ఫోన్ నంబర్‌ను 123456789 అని పేర్కొన్నారని, అలాంటి ఫోన్‌నంబర్ ఉంటుందని కూడా తెలియదని పేర్కొన్నారు. 2025 మార్చి 31 నాటికి కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరని, ఉద్యోగుల సంఖ్య సున్నా అని కంపెనీ వివరాల్లోనే పేర్కొన్నారని తెలిపారు. కంపెనీ మూలధనం కూడా రూ.లక్ష మాత్రమేనని, ఎక్కడో పటాన్‌చెరులో ఒక చిన్న ఇంటిని ఆఫీసు అడ్రస్‌గా పేర్కొన్నారని చెప్పారు. ఇలాంటి కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని గజం రూ.3,700 చొప్పున రూ.7 కోట్లకే కేటాయించిందని తెలిపారు. ఇలాంటి షెల్ కంపెనీకి ఇంత భూమిని కేటాయించడం స్కామ్ కాదా? అని ప్రశ్నించారు.
టెస్సెరాక్ట్‌కు కొండల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని, అసలు ఆయనకైనా తన శాఖ మీద పట్టుందా? అని ప్రశ్నించారు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్త, కోర్టులను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డి అమెరికాలో ఉండగా.. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ బయో సంస్థతో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. ఆ అగ్రిమెంట్ తర్వాత ఆ సంస్థకు ఎక్కడైనా భూములు కేటాయించారా? అనే విషయాన్నీ బయటపెడతామన్నారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టుల వ్యవహారాన్ని గతంలోనే బయటపెట్టామని గుర్తు చేశారు.
