స్మార్ట్ టెక్నాలజీతో పురుగుల బెడదకు చెక్ ..రైతులకు AI సలహాలు

స్మార్ట్ టెక్నాలజీతో పురుగుల బెడదకు చెక్ ..రైతులకు AI సలహాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హార్టికల్చర్​కింద పండ్లు, కూరగాయల దిగుబడులను పెంచడంతోపాటు సాగు వ్యయాన్ని తగ్గించేందుకు హార్టికల్చర్​వర్సిటీ, రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్తంగా కార్యాచరణ చేపడుతున్నట్లు వర్సిటీ వైస్‌‌చాన్సలర్ (వీసీ) డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధులు, వర్సిటీ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కూరగాయలు, మామిడి, ఆయిల్‌‌పామ్ తదితర పంటల్లో రైతులకు అవసరమైన లేటెస్ట్​టెక్నాలజీ, శిక్షణ, శాస్త్రీయ పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. తొలిదశలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద వర్కింగ్ మోడల్ రూపొందించనున్నట్లు తెలిపారు. కూరగాయల పంటల్లో అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం, నేలలు, పురుగులు–తెగుళ్ల నివారణ, సాగు ఖర్చుల నియంత్రణ వంటి అంశాల్లో లేటెస్ట్​టెక్నాలజీ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు.

రైతులకు అవసరమైన సలహాలను ప్రత్యక్షంగా, మొబైల్ యాప్ ద్వారా ఏఐ ఆధారంగా అందించే విధానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. టమాటా, బెండ, క్యాబేజీ, కుకుర్బిటేసియస్ పంటల్లో రసం పీల్చే పురుగులు, కాయలు, పువ్వులను తొలిచే పురుగుల నియంత్రణకు కొత్త సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు  వీసీ తెలిపారు. అగ్రి హాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఇమేజ్ ఆధారిత స్మార్ట్ పెస్ట్ ట్రాప్ టెక్నాలజీపై పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సదరు సంస్థతో ఎంఓయూ చేసుకోనున్నట్లు చెప్పారు.