గ్రామాల్లోని స్కూళ్ల అభివృద్ధికి CJP దేశ వ్యాప్త ప్రచారం

గ్రామాల్లోని స్కూళ్ల అభివృద్ధికి CJP దేశ వ్యాప్త ప్రచారం
  • సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపు
  • ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి

ముంబై: గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక వసతులను మెరుగుపరిచేందుకు గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, తల్లిదండ్రులు సామాజిక బాధ్యత తీసుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో చేపడుతున్న దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఆగస్టు 15న భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. ఈమేరకు మంగళవారం ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

‘‘మనం కొత్త పార్లమెంటు, ప్రధాని నూతన నివాసాన్ని నిర్మించుకున్నాం. మరి మన గ్రామాల్లో కొత్త స్కూళ్లను ఎందుకు నిర్మించుకోలేకపోయాం? గ్రామీణ రైతులు, కార్మికుల పిల్లలను దేశ భవిష్యత్తుగా మనం భావించడం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ పిల్లలు నేటికీ పాఠశాలలకు వెళ్లేందుకు చాలా దూరం నడవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సొంత గ్రామం నుంచే శ్రీకారం
మహారాష్ట్రలోని తన సొంత గ్రామం హింగోలీకి వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్‌‌‌‌‌‌‌‌ను కోరనున్నట్టు అభిజీత్ దిప్కే వెల్లడించారు. దేశంలోని సర్పంచ్‌‌‌‌‌‌‌‌లందరూ తమ గ్రామీణ బడుల రూపురేఖలు మార్చడానికి ముందుకు రావాలని, వారి కృషిని విజువల్స్‌‌‌‌‌‌‌‌తో సహా సీజేపీ సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లలో పోస్ట్ చేస్తామని పేర్కొన్నారు. కాగా, పాఠశాలల్లో విద్యుత్, నీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేదో తల్లిదండ్రులు స్వయంగా పరిశీలించి సోషల్ ఆడిట్ చేయాలని అభిజీత్ దీప్కే కోరారు.