జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌.. నిరుద్యోగులపై లాఠీచార్జ్కు నిరసనగా రోడ్డెక్కిన బీజేపీ

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌.. నిరుద్యోగులపై లాఠీచార్జ్కు నిరసనగా రోడ్డెక్కిన బీజేపీ
  • రోడ్లపై టైర్ల దగ్ధం.. వాహనాల అడ్డగింత.. మూతపడ్డ స్కూల్స్, షాపులు
  • రాష్ట్రంలో స్తంభించిన జనజీవనం.. 110 మంది ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్
  • జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి: బీజేపీ స్టేట్ చీఫ్

రాంచీ: జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లో సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టింది. రాష్ట్ర రాజధాని రాంచీతో పాటు పలు సిటీల్లో చాలా వరకు స్కూల్స్, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

కిషోర్‌‌‌‌‌‌‌‌ గంజ్, అర్గోరా, కాంకే ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. పలు ఏరియాల్లో కార్యకర్తలు రోడ్లపై టైర్లను దహనం చేసి.. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో రాంచీ సహా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.

అయితే, అత్యవసర సేవలకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో రాంచీలోని రాతు రోడ్డులో జరిగిన నిరసనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు పాల్గొని, మాట్లాడారు.  జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు.

నిరుద్యోగ యువతకు మద్దతుగా ప్రజలంతా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. లాఠీచార్జ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అధికార కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షలో జరిగిన అవకతవకలపై రాంచీకి వచ్చి నిరసన తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ఎదుట బైఠాయించాలని కోరారు.

110 మంది ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్
విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తూ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ మంగళవారం విధానసభ మార్చ్ నిర్వహించింది. నిరసనకారులు రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్  ప్రాంతంలోని పాత అసెంబ్లీ నుంచి బయలుదేరి, కుటేగ్రామ్ (ధుర్వా)లోని కొత్త అసెంబ్లీ వైపు మార్చ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని, 110 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో కొందరు ఆందోళనకారులు ఏకంగా పోలీసు వ్యాన్లపైకి ఎక్కి నిరసన తెలిపారు.

విద్యార్థుల పోరాటం హక్కుల కోసమే..
పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలుపుతున్న జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులపై పోలీసులు జరిపిన చర్యలను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఖండించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన ఘటనే ఇక్కడ కూడా పునరావృతమైందన్నారు. మంగళవారం తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీనగర్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో  మాట్లాడారు.

రాజకీయ పార్టీల ఆందోళనల సమయంలో లేని నిబంధనలు, కేవలం విద్యార్థులు రోడ్డెక్కినప్పుడే ఎందుకు గుర్తుకొస్తాయని జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని దీప్కే నిలదీశారు. విద్యార్థులు, నిరుద్యోగులపై ప్రయోగించినట్లు రాజకీయ నేతలపై పోలీసులు ఎందుకు లాఠీచార్జ్, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించరని ప్రశ్నించారు. నిరుద్యోగులకు మద్దతుగా రాంచీలో నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహతోతో తాను ఫోన్లో మాట్లాడినట్లు దీప్కే తెలిపారు.