- స్టే ఎత్తివేతతో ఎంజీబీఎస్- చంద్రాయణగుట్టలో పనులకు రూట్ క్లియర్
- భారీ ప్రాజెక్టుల అలైన్‌మెంట్‌పై తుది నిర్ణయం నిపుణులదే అని కామెంట్
- భూసేకరణ చట్టబద్ధతను తుది విచారణలోనే నిర్ణయిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మెట్రో భూసేకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎంజీబీఎస్– -చంద్రాయణగుట్ట మెట్రో కారిడార్-4 పనులకు ఉన్న అడ్డంకులు తాత్కాలికంగా తొలగిపోయాయి. ఈ మెట్రో రైల్వే లైన్లో భూసేకరణపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. భూ సేకరణ ప్రక్రియపై చట్టబద్ధత వ్యవహారం పెండింగ్‌లోనే ఉంటుందని తేల్చి చెప్పింది. భూ సేకరణ ప్రక్రియతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం పథకం అమలు చట్టబద్ధతను తుది విచారణలో తేలుస్తామని పేర్కొంది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా కేవలం ఒకవైపు ఎక్కువగా భూమిని సేకరించడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుడివైపు 10 నుంచి 12 అడుగులు, ఎడమ వైపు 20 నుంచి 30 అడుగులు భూసేకరణ చేపట్టడం వివక్ష చూపడమేనని, దీంతో రెండు మూడు తరాలుగా వ్యాపారాలు చేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. మెట్రో రైల్వే తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీతో పాటు సమ్మతి అంగీకార నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు భూసేకరణకు అంగీకారం తెలిపారని చెప్పారు. పునరావాసం, పునర్నిర్మాణం కింద పరిహారంగా రూ.12.04 లక్షలు కుటుంబానికి, వ్యాపారాలు, అద్దె కోల్పోయిన వారికి రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు తెలిపారు.
చట్టానికి విరుద్ధంగా ఉంటే జోక్యం చేస్కుంటం
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. మెట్రో రైల్వే వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల అలైన్మెంట్, సాంకేతికత సాధ్యాసాధ్యాలపై నిర్ణయం నిపుణులదేనని, ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్నదని గుర్తుచేశారు. చట్టానికి విరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరిత నిర్ణయం తీసుకున్నట్లు రుజువైన సందర్భాల్లోనే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుందన ఇచెప్పారు. మెట్రో రైల్వే ప్రాజెక్టు పనులు నిలిచిపోతే హైదరాబాద్‌లోని రవాణా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గతంలో మంజూరు చేసిన స్టేను ఎత్తివేస్తున్నామన్నారు. భూ సేకరణ 2013 చట్టంలోని నిబంధనలు, అభ్యంతరాల పరిశీలన, ఇతర విధివిధానాలు పాటించారా లేదా అనే అంశాలపై నిర్ణయాన్ని తుది విచారణలో తేలుస్తామని స్పష్టం చేశారు. చట్ట నిబంధనల ప్రకారం మెట్రో పనులను కొనసాగించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
