- ఆయన మౌనంగా ఉన్నా.. అత్యంత ప్రభావవంతమైన ప్రధాని: సోనియా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చరిత్రలో గొప్పగా నిలిచిపోతుందని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. ఆయన మౌనంగా, సౌమ్యంగా ఉన్నా అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. బొగ్గు బ్లాక్ కేటాయింపుల కేసులో సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలకు పూర్తిగా తెరపడిందన్నారు. మన్మోహన్‌పై జరిగిన ప్రచారం, ఆరోపణల వెనుక బ్యూరోక్రసీ, మీడియా, న్యాయవ్యవస్థ, సివిల్ సొసైటీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందినవారి పాత్ర ఉందని ఆరోపించారు. దీంతో ఆయనపై సాగిన అబద్ధపు ఆరోపణల కుట్రలు తేలిపోయాయని అన్నారు.
ఆర్థిక వృద్ధి నుంచి మీడియా స్వేచ్ఛ వరకు..
మన్మోహన్ హయాంలో దేశం కీలక ఆర్థిక మార్పులను చూసిందని సోనియా పేర్కొన్నారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ పటిష్టంగా నిలిచిందన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో జీడీపీ లెక్కింపు విధానంలో మార్పులు చేసినప్పటికీ.. ఆర్థిక వృద్ధి గత 12 ఏళ్ల కంటే అధికంగా ఉందని చెప్పారు. ఈ వృద్ధి వల్ల లక్షలాది మంది మెరుగైన ఉపాధి రంగాల్లోకి వెళ్లడంతోపాటు కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. అదే సమయంలో ఐఐటీ, ఐఐఎంల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయాన్ని విస్తరించారని చెప్పారు.
