ఢిల్లీ డ్రామాలు కాదు.. జార్ఖండ్ వాస్తవాలు చూడు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

ఢిల్లీ డ్రామాలు కాదు..  జార్ఖండ్ వాస్తవాలు చూడు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  •     రాహుల్‌‌ గాంధీకి బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు సూచన
  •     నిజమైన స్టూడెంట్ల ఆందోళన కాంగ్రెస్‌‌కు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన పేరుతో కాంగ్రెస్, ఇండియా కూటమి చేసింది కేవలం పొలిటికల్ డ్రామా అని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే.. ఇండియా కూటమి అధికారంలో ఉన్న జార్ఖండ్‌‌కు వెళ్లి అక్కడి వాస్తవాలను చూడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో  మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీలో నీట్ ఆందోళనలో పాల్గొన్న వారిలో 90% మంది విద్యార్థులు కారని, బయటి వ్యక్తులేనని అన్నారు.అక్కడ దేశ వ్యతిరేక నినాదాలు, కాశ్మీర్ ఆజాదీ నినాదాలు రావడం వెనుక దాగున్న కుట్ర ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులతో సంబంధం లేని వర్గాలు ఆందోళనలోకి ఎందుకు వచ్చాయని  నిలదీశారు. 

రాహుల్‌‌ ఫెయిల్డ్ లీడర్‌‌

నీట్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు.. జార్ఖండ్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని రాంచందర్ రావు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నా రాహుల్ గాంధీ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ.. పారిపోకండి, దాక్కోకండి. పార్లమెంటుకు వచ్చి చర్చను ఎదుర్కోండి’ అని సవాల్ విసిరారు. రోడ్లపై డ్రామాలు మానుకొని వాస్తవాలను ఎదుర్కోవాలని హితవు పలికారు. ఫెయిల్డ్ లీడర్‌‌గా మారిన రాహుల్‌‌కు.. ప్రశ్నలు అడగడమే కాదు, సమాధానాలు వినే ధైర్యం కూడా ఉండాలన్నారు.

హామీలు అమలు చేయాలి 

తెలంగాణలోనూ పేపర్ లీకేజీ ఘటనలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల టైమ్‌‌లో అశోక్‌‌నగర్‌‌కు వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో 4 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. జార్ఖండ్ లో జరిగిన పేపర్ లీకేజీ కేసులను వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. 

హర్ ఘర్ తిరంగా యాత్రపై సన్నాహక మీటింగ్.. 

హర్ ఘర్ తిరంగా అభియాన్‌‌లో భాగంగా ఈనెల14న ట్యాంక్‌‌బండ్‌‌పై నిర్వహించనున్న భారీ తిరంగా యాత్రకు బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్రను చేపట్టనున్నట్టనున్నట్టు చెప్పారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణపై జీహెచ్ఎంసీ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులతో ఆయన చర్చించారు.