ఎంబీబీఎస్‌‌కు పాత ఫీజులే ...ఫీజులు ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్

ఎంబీబీఎస్‌‌కు పాత ఫీజులే ...ఫీజులు ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్
  • ఎంబీబీఎస్‌‌కు పాత ఫీజులే
  • ఫీజులు ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ 
  • ప్రైవేట్, మైనారిటీ, ఆర్మీ మెడికల్ కాలేజీల్లో పాత జీవోల ప్రకారమే వసూళ్లు
  • రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2026–-2029 బ్లాక్ పీరియడ్‌‌కు సంబంధించి ఫీజులను పెంచకుండా, పాత ఫీజులనే కొనసాగిస్తూ కాళోజీ నారాయణరావు వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్యూహెచ్ఎస్‌‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ జీవో నంబర్ 98 ప్రకారం.. 2023–-26 కాలానికి ఉన్న ఫీజు స్ట్రక్చరే వచ్చే  మూడేండ్లపాటు అమల్లో ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. 


దీనివల్ల ప్రైవేట్, అన్-ఎయిడెడ్, నాన్ -మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీలతోపాటు ఆర్మీ డెంటల్ కాలేజీలో చేరే విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడదు. ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై ప్రైవేట్​ కాలేజీలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఫీజులు పెంచకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. 


కేటగిరీలవారీగా ఫీజులు ఇవే.. 


ప్రభుత్వ నిర్ణయం ప్రకారం..  ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా (కేటగిరీ ఏ) ఫీజు ఏడాదికి 60 వేల రూపాయలుగా ఉండనుంది. మేనేజ్‌‌‌‌మెంట్ కోటా (కేటగిరీ బీ) కింద ఆయా కాలేజీలను బట్టి 11.55 లక్షల నుంచి 13 లక్షల రూపాయల వరకు, ఎన్ఆర్ఐ కోటా (కేటగిరీ-–సీ) కింద మేనేజ్‌‌‌‌మెంట్ ఫీజుకు రెండు రెట్ల వరకు వసూలు చేయనున్నారు. ఇక డెంటల్ (బీడీఎస్) కోర్సులో ఏ- కేటగిరీకి 45 వేలు, బీ కేటగిరీకి 4.20 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఒకవేళ ఈ బ్లాక్ పీరియడ్‌‌‌‌లో కొత్తగా ఏవైనా కాలేజీలు ఏర్పాటు చేసినా, వాటికి కూడా అప్పటికే ఉన్న కనిష్ట ఫీజునే వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, మొత్తం కోర్సు ఫీజును కూడా వెల్లడిస్తే బాగుండేదనే అభిప్రాయాలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు 


ఫీజుల వసూళ్లలో కాలేజీల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది. నిర్ణయించిన ఫీజు కంటే ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా, డొనేషన్ల పేరిట వేధించినా అది లాభార్జన కిందకే వస్తుందని, అలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మొత్తం కోర్సు ఫీజును 5 డతల్లో, ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో మాత్రమే తీసుకోవాలని సూచించింది. కోర్సు మధ్యలో ఫీజులు పెంచడానికి వీల్లేదని, విద్యార్థులు చేరినప్పుడు ఉన్న ఫీజులే కోర్సు పూర్తయ్యే వరకు వర్తిస్తాయని వెల్లడించింది. ఫీజులు పెంచకుండా పాతవే కొనసాగించడంపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ (పీఎఎంఎస్) హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నందుకు ప్రభుత్వానికి  అసోసియేషన్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి కృతజ్ఞతలు తెలిపారు.

ఫీజులు ఇలా..
కోటా                                                      ఫీజు
 కన్వీనర్ కోటా (కేటగిరీ- ఏ)               రూ.60 వేలు
 మేనేజ్‌‌‌‌మెంట్ కోటా (కేటగిరీ- బీ)     రూ.11.55 లక్షలు-రూ.13 లక్షలు
 ఎన్ఆర్ఐ కోటా (కేటగిరీ- సీ)             రూ.23 లక్షలు- రూ.26 లక్షలు
 బీడీఎస్ (కేటగిరీ- ఏ)                        రూ.45 వేలు
 బీడీఎస్ (కేటగిరీ- బీ)                        4.20 లక్షలు- రూ.5 లక్షలు