హైదరాబాదీలకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్: KBR పార్క్ చుట్టూ వన్‌‌వే.. ఏడాదిన్నర పాటు ఆంక్షలు

హైదరాబాదీలకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్: KBR పార్క్ చుట్టూ వన్‌‌వే.. ఏడాదిన్నర పాటు ఆంక్షలు
  • ఈ నెల 18 నుంచి ఆంక్షలు.. ఏడాదిన్నర పాటు అమలు
  • పంజాగుట్ట నుంచి మాదాపూర్‌‌‌‌ వెళ్లాలంటే ఎన్టీఆర్‌‌‌‌ భవన్ సిగ్నల్‌‌ వద్ద లెఫ్ట్‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌ భవన్‌‌, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్ 45 మీదుగా వెళ్లాలి
  • మాదాపూర్ నుంచి పంజాగుట్టకు.. జూబ్లీహిల్స్‌‌ చెక్‌‌పోస్ట్‌‌ , 
  • ఎల్వీ ప్రసాద్‌‌, రోడ్‌‌ నంబర్1,  నాగార్జున సర్కిల్‌‌ మీదుగా
  • సైన్ బోర్డులు, కమాండ్‌‌ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్‌‌
  • పోలీసులకు వాహనదారులు సహకరించాలి: సీపీ సజ్జనార్‌‌

హైదరాబాద్‌‌,వెలుగు: సిటీలో అతిపెద్ద జంక్షన్‌‌ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌‌ వే ట్రాఫిక్ అమలులోకి రానుంది. ‘హెచ్ -సిటీ’ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌‌పాస్‌‌ల నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్‌‌ ఆంక్షలు విధించారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు.. రోడ్డు నంబర్1 మీదుగా వెళ్లి ఎన్టీఆర్ భవన్‌‌ సిగ్నల్‌‌ వద్ద ఎడమ వైపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్‌‌‌‌ఎస్‌‌ భవన్, ఒమేగా హాస్పిటల్‌‌, జర్నలిస్ట్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్‌‌ రోడ్ నంబర్ 45 మీదుగా ప్రయాణం చేయాలి. 

మాదాపూర్‌‌‌‌ నుంచి పంజాగుట్ట వచ్చే వాహనాలు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌‌, ఎన్టీఆర్‌‌‌‌ భవన్, ఎల్వీ ప్రసాద్‌‌, రోడ్‌‌ నంబర్1 మీదుగా ప్రయాణించాలి. ఈ మార్గంలో ఎక్కడా రైట్​టర్న్​కు అవకాశం లేదు. ఈ నెల 18 నుంచి అమల్లోకి రానున్న ఈ వన్‌‌ వే విధానం.. ఫ్లై ఓవర్‌‌‌‌, అండర్ పాస్ పనులు పూర్తయ్యేంత వరకు దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగనుంది. 

ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌‌తో కలిసి సీపీ సజ్జనార్‌‌‌‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో ట్రావెల్‌‌ చేసే వాహనదారులు సైన్‌‌ బోర్డులను అనుసరించి ప్రయాణించాలని సూచించారు. ఈ ఆంక్షలు ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యేంత వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.

వన్‌‌ వే కోసం రెండు సార్లు ట్రయల్ రన్స్‌‌

కేబీఆర్ పార్క్‌‌ చుట్టూ ఫ్లై ఓవర్‌‌‌‌, అండర్ పాసుల నిర్మాణ పనుల కారణంగా రోడ్ల విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో నిరంతరం రోడ్డుపై ఇరువైపులా తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌‌ అవుతోంది. ఈ క్రమంలోనే  ప్రయాణంలో ఆలస్యం,  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి పార్క్ చుట్టూ ఇప్పటికే రెండు సార్లు పైలట్ ట్రయల్‌‌ రన్స్‌‌ నిర్వహించారు. 

మే 5వ తేదీన మొదటి ట్రయల్ రన్‌‌ దాదాపు 3 గంటల పాటు నిర్వహించారు. జూన్ 21న దాదాపు 6 గంటల పాటు రెండో సారి ట్రయల్‌‌ రన్ నిర్వహించారు. ఈ రెండు ట్రయల్స్ సమయంలో ట్రాఫిక్, జంక్షన్ల పనితీరు, లేన్ మానిటరింగ్‌‌, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు వాహనదారుల రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలించారు.

డ్రోన్స్‌‌ పర్యవేక్షణ, 24 గంటలు ట్రాఫిక్ సిబ్బంది

ట్రయల్ రన్స్ అనంతరం వన్‌‌ వేలో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు. వన్‌‌ వేతో పాటు వివిధ మార్గాల్లో వన్‌‌ వేలో కలిసి వాహనాలు ఎంట్రీ, ఎగ్జిట్‌‌, ప్రయాణించాల్సిన రూట్లతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వాహనదారులకు సీపీ సజ్జనార్‌‌‌‌ పలు సూచనలు చేశారు. నిర్దేశించిన వన్ వే ట్రాఫిక్‌‌లో లేన్, సైన్ బోర్డుల ప్రకారం సూచించిన దిశలో వాహనదారులు ప్రయాణం చేయాలని సూచించారు. 

సీసీ టీవీలు, డ్రోన్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్‌‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటామన్నారు. ఇందుకోసం 24 గంటల పాటు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం అందిస్తారు. వన్‌‌ వే తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కేబీఆర్ కారిడార్‌‌‌‌లో కలిసే వాహనాల రాకపోకలను అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపడతామని సజ్జనార్ వెల్లడించారు.

ట్రాఫిక్ పోలీసుల ఏర్పాట్లు ఇలా:

లేన్ మార్కింగ్‌‌లు, లేన్ చేంజర్‌‌లు
ట్రావెల్ చేయాల్సిన రూట్స్‌‌, సైన్ బోర్డులు
గూగుల్ మ్యాప్స్/నావిగేషన్ రూట్లలో రూట్‌‌ మ్యాప్‌‌
ట్రాఫిక్ రద్దీని అంచనా వేసేందుకు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ

ప్రయాణికులు, కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌ వాకర్లకు పోలీసుల సూచనలు:

వన్-వే ట్రాఫిక్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి
లేన్‌‌ 2 ద్వారా అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్ల వంటి అత్యవసర వాహనాలు
పార్క్‌‌కు వచ్చే విజిటర్స్, వాకర్లు తమ వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే నిలపాలి
నిర్ధేశించిన వన్‌‌ వే కారిడార్‌‌‌‌లో రాంగ్- సైడ్ డ్రైవింగ్ నిషేధం

కేబీఆర్​ పార్క్ చుట్టూ వన్-వే ఇలా..

కుడి నుండి ఎడమకు లేన్ మార్పులు:
 TG స్టడీ సర్కిల్ వద్ద U-టర్న్
 BRS భవన్ వద్ద U-టర్న్
 ఒమేగా హాస్పిటల్ వద్ద U-టర్న్
 జానారెడ్డి వద్ద U-టర్న్
 అపోలో క్రెడిల్ వద్ద U-టర్న్
 తాజ్ మహల్ వద్ద U-టర్న్
 ఫీనిక్స్ బిల్డింగ్ వద్ద U-టర్న్
 రోడ్ నం. 65 వద్ద U-టర్న్
 మంత్రి టవర్స్ వద్ద U-టర్న్
 క్రీమ్ స్టోన్ వద్ద U-టర్న్

ఎడమ నుండి కుడికి లేన్ మార్పులు:

 TG స్టడీ సర్కిల్ వద్ద U-టర్న్
 BRS భవన్ వద్ద U-టర్న్
 ఒమేగా హాస్పిటల్ వద్ద U-టర్న్
 జానారెడ్డి వద్ద U-టర్న్
 అపోలో క్రెడిల్ వద్ద U-టర్న్
 తాజ్ మహల్ వద్ద U-టర్న్
 ఫీనిక్స్ బిల్డింగ్ వద్ద U-టర్న్
 రోడ్ నం. 65 వద్ద U-టర్న్
 మంత్రి టవర్స్ వద్ద U-టర్న్
 క్రీమ్ స్టోన్ వద్ద U-టర్న్

బయటకు వెళ్లే మార్గాలు:

 రోడ్ నం. 14
 నంది నగర్
 రోడ్ నం. 10, జహీర్ నగర్
 న్యూ వరల్డ్
 అగ్రసేన్ ఐలాండ్, 
    రోడ్ నం. 12
 ఒమేగా హాస్పిటల్, 
    లోటస్ పాండ్
 TTD ఆలయ రోడ్డు
 BVB జంక్షన్ 
    మరియు ఫిల్మ్ నగర్
 జర్నలిస్ట్ కాలనీ
 రోడ్ నం. 45
 రోడ్ నం. 36 మరియు 
    పెద్దమ్మ ఆలయం
 అన్నపూర్ణ స్టూడియో బైలేన్
 NTR భవన్