కిలో వెండి 2 లక్షల 65 వేల రూపాయలే.. 2 రోజుల్లో లక్షా 36 వేలు తగ్గింది..!

కిలో వెండి 2 లక్షల 65 వేల రూపాయలే.. 2 రోజుల్లో లక్షా 36 వేలు తగ్గింది..!

వారం రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4 లక్షల ఆల్ టైమ్ రికార్డ్ మార్క్ టచ్ అయ్యింది. తులం బంగారం ధర దాదాపు రూ.2 లక్షలకు చేరువైంది. ఒకదానికి ఒకటి పోటీ పడుతూ గోల్డ్, సిల్వర్ రేట్లు పరుగులు పెట్టాయి. ధరలు ఆకాశనంటడంతో బంగారం, వెండి కొనడంపై సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆశలు వదిలేసుకున్నారు. 

కానీ వారం రోజుల్లో సీన్ రివర్స్ అయ్యింది. బంగారం, వెండి ధరలు ఏ విధంగా పరుగులు పెట్టాయో అంతకు రెట్టింపు వేగంగా పతనం అయ్యాయి. ముఖ్యంగా వెండి ధర అయితే అమాంతం పడిపోయింది. కేవలం 2 రోజుల్లోనే లక్షా 36 వేల రూపాయలు తగ్గింది. వారం క్రితం నాలుగు లక్షల ఆల్ టైమ్ రికార్డ్ ధరను టచ్ అయిన వెండి.. బులియన్ మార్కెట్‎లో 2026, ఫిబ్రవరి 1వ తేదీన 2 లక్షల 65 వేలకు దిగొచ్చింది. 

వెండి, బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణం ఇదే:

వారం రోజులుగా పైపైకి దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు ఫిబ్రవరి 1న 2026-27 యూనియన్ బడ్జెట్, అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ట స్థాయిల నుంచి బంగారం ధర దాదాపు 20 శాతం మేర తగ్గుదలను చూసింది. రూ.లక్ష 82వేల 500 వద్ద ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ.లక్ష 47వేల 800 స్థాయికి పడిపోయింది. 

►ALSO READ | బడ్జెట్ 2026లో డీప్-టెక్‌పై ఫోకస్.. క్రిప్టో రంగానికి ప్రయోజనం ఇదే..

వెండి ధరలో పతనం ఇంకా ఎక్కువగా ఉంది. ఏకంగా 36 శాతం క్షీణించిన వెండి, రూ. 4లక్షల 20వేల నుంచి రూ.2లక్షల 65వేల 650కు దిగొచ్చింది. దీనికి కారణాలను పరిశీలిస్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ ఎంపిక కావడంతో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్‎కి మొగ్గు చూపడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. బడ్జెట్‌లో సుంకాల తగ్గింపు ఉంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురవ్వడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. రానున్న రోజుల్లో ధరలు మరింత నిలకడగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.