ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి.. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసేవరకు వెళ్ళింది పరిస్థితి. ఈ క్రమంలో శనివారం ( జనవరి 31 ) వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి కేసులో ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి సతీమణి విజయలక్ష్మి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఇవాళ ( ఫిబ్రవరి 1 ) విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకూ అంబటి రాంబాబు కుటుంబానికి హై సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో పేర్కొన్నారు అంబటి సతీమణి. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని.. శాంతిబద్రతల సమస్య ఉందని పేర్కొన్నారు విజయలక్ష్మి. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు అంబటి కుటుంబానికి హై సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఇదిలా ఉండగా..మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పంటించారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకున్నాయి.. దట్టమైన పొగ కమ్మేసింది. జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. కూటమి పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని అంటున్నారు.
