ఇస్లామాబాద్: 2026 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనాలని పాక్ డిసైడ్ అయ్యింది. కానీ వరల్డ్ కప్‌లో భాగంగా 2026, ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఇండియాతో జరగనున్న మ్యాచ్ ఆడొద్దని దాయాది దేశం నిర్ణయించుకుంది.
పాక్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవరాల్ క్రికెట్లోనే ఇండియా, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ వేరు. కానీ పాక్ నిర్ణయంతో అభిమానులకు ఇప్పుడు ఈ అవకాశం లేకుండాపోయింది. మరీ పాక్ నిర్ణయంపై ఐసీసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచులను ఇండియా బయట ఇతర వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. కానీ అప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ రిజెక్ట్ చేసింది.
దీంతో బంగ్లా వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. అయితే.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్‌ను బాయ్ కాట్ చేయాలని భావించింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం, ఆ దేశ క్రికెట్ బోర్డు చర్చలు జరిపాయి. చివరకు టీ20 వరల్డ్ కప్ పాల్గొనేందుకు పాకిస్తాన్ టీమ్‌కు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కానీ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోలేదు. దీంతో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో పార్టిసిపేట్ చేస్తోంది కానీ ఇండియాతో మ్యాచ్ ఆడదు. మొత్తం టోర్నీని బహిష్కరిస్తే భారీగా ఆర్ధిక నష్టం వస్తుందనే భయంతోనే పాక్ ఈ జిత్తులమారి ప్లాన్ వేసినట్లు క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, పాక్ లేకుంటే వరల్డ్ కప్ అంతా కిక్కు ఉండదంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్:
2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.
ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్లో భాగం కానున్నాయి.
భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
