సోలార్ ప్యానెల్స్ తయారీ కంపెనీల సంచలన నిర్ణయం.. వెండి రేట్లు భారీగానే తగ్గబోతున్నాయా..?

సోలార్ ప్యానెల్స్ తయారీ కంపెనీల సంచలన నిర్ణయం.. వెండి రేట్లు భారీగానే తగ్గబోతున్నాయా..?

వెండి విషయంలో అనుకున్నదే జరుగుతోందా అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇండస్ట్రియల్ వెండి వాడకం తగ్గింది. అయితే రిటైలర్లు ఎగబడటంతో వచ్చిన ర్యాలీ హైప్ అమెరికా ట్రంప్ నిర్ణయం దెబ్బకు కుప్పకూలింది. మార్కెట్లో అతి ఎప్పటికీ కొనసాగదని.. ఇండస్ట్రీ డిమాండ్ లేకుండా వచ్చే డిమాండ్ బబుల్ ఖచ్చితంగా పేలిపోతుందని వెండి తాజా పతనం నుంచి అర్థం చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ జోరు కొనసాగుతుందా అంటే అవును అనే జవాబే వినిపిస్తోంది. అసలు సోలార్ పరిశ్రమలోని కంపెనీలు తీసుకున్న నిర్ణయం వెండి రేట్లను ఎలా ప్రభావితం చేయనుందో ఇప్పుడు తెలుసుకుందాం... 

సౌర విద్యుత్ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలు ఇప్పుడు ఒక కొత్త మార్పుకు సిద్ధమవుతున్నాయి. సోలార్ ప్యానెల్స్ తయారీలో కీలకమైన వెండి వాడకాన్ని భారీగా తగ్గించాలని లేదా పూర్తిగా ఆపేయాలని వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, ఎమ్వీ వంటి సంస్థలు నిర్ణయించుకున్నాయి. వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుండటమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

గడిచిన ఏడాది కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేట్లు విపరీతంగా పెరిగాయి. 2025లో రెట్టింపైన వెండి ధర, 2026 ప్రారంభం నాటికే మరో 40 శాతం మేర పెరిగింది. దీనివల్ల సోలార్ సెల్ తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. గతంలో ఒక వాట్ తయారీకి ఒక సెంటుగా ఉన్న వెండి ఖర్చు, ఇప్పుడు 2.7 సెంట్లకు చేరింది. ఈ అదనపు భారం కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఒక 2 చదరపు మీటర్ల సోలార్ ప్యానెల్‌లో దాదాపు 20 గ్రాముల వెండిని ఉపయోగిస్తారు. విద్యుత్తును సమర్థవంతంగా ప్రవహింపజేయడానికి ఇది అవసరం. కానీ ప్రస్తుతం రేట్లు పెరుగుతున్న తరుణంలో వెండి వాడకాన్ని ఆపేయాలని కంపెనీలు భావిస్తు్న్నాయి. 

ధరల పెరుగుదలను తట్టుకోవడానికి కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. పాత 'మల్టీక్రిస్టలైన్' సాంకేతికత నుంచి TOPConకు మారడం వల్ల ఇప్పటికే వెండి వినియోగం 68 శాతం తగ్గిందన్నారు ప్రీమియర్ ఎనర్జీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలుజా. రానున్న రోజుల్లో దీన్ని మరో 30 శాతం తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వెండికి బదులుగా తక్కువ ధరలో లభించే రాగి వాడటంపై కంపెనీలు దృష్టి సారించాయి. చైనా ఇప్పటికే 'సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్' అనే కొత్త విధానాన్ని వాడుతోంది. భారతీయ కంపెనీలు కూడా రాగి ఆధారిత ప్రత్యామ్నాయాలను వచ్చే కొన్ని త్రైమాసికాల్లో అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఎమ్వీ కంపెనీ ఇప్పటికే తమ వెండి వినియోగాన్ని 60 శాతం తగ్గించగా, మరో 40 శాతం తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

కస్టమర్లపై ప్రభావం ఉంటుందా? 

వారీ ఎనర్జీస్ వంటి దిగ్గజ సంస్థలు ముందస్తు ఒప్పందాలు, సాంకేతిక మెరుగుదల ద్వారా ఈ ధరల పెరుగుదలను తట్టుకుంటున్నాయి. ధరలు పెరిగినప్పటికీ, సాంకేతిక మార్పుల వల్ల సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెండి వాడకం తగ్గించి, రాగి వంటి చౌకైన లోహాలను వాడటం ద్వారా భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. సో వెండికి పారిశ్రామిక డిమాండ్ తగ్గుతోంది కాబట్టి రానున్న రోజుల్లో రిటైల్ రేట్లు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.