Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 ఫినాలే ఫీవర్: కన్నీళ్లు పెటించిన తనూజ జర్నీ.. పవన్‌పై బిగ్ బాస్ ప్రశంసల వర్షం!

Bigg Boss 9 Telugu:  బిగ్ బాస్ 9 ఫినాలే ఫీవర్: కన్నీళ్లు పెటించిన తనూజ జర్నీ.. పవన్‌పై బిగ్ బాస్ ప్రశంసల వర్షం!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'  క్లైమాక్స్ కు చేరుకుంది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ పీక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం టాప్-5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను (AV) ప్రదర్శిస్తూ బిగ్ బాస్ ఇంటి సభ్యులను, ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తున్నారు. నిన్న ఇమ్మాన్యుయేల్ జర్నీతో మొదలైన ఈ సందడి,  ఈరోజు ఎపిసోడ్ లో ( 102 వ రోజు ) తనూజ పుట్టస్వామి , పవన్ జర్నీలతో మరింత ఆసక్తికరంగా మారింది.

'దూదిలాంటి మనసు.. శివంగిలాంటి ధీరత్వం!'

ఈ రోజు తనూజ స్పెషల్ ఏవీని బిగ్ బాస్ అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన తన ఫోటో గ్యాలరీని చూసి తనూజ భావోద్వేగానికి గురైంది. తనూజ కోసం బిగ్ బాస్ ఆమెకు ఇష్టమైన 'స్పెషల్ కాఫీ'ని ఏర్పాటు చేయడం హైలైట్‌గా నిలిచింది. తనూజను ఉద్దేశించి బిగ్ బాస్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. నటనకు ఆస్కారం లేని ఈ ఇంట్లో.. మీ వ్యక్తిత్వంతో అందరినీ మెప్పించారు. చిన్న విషయాలకు బాధపడే దూదిలాంటి సున్నిత మనసు మీది. కానీ, టాస్క్ అని వస్తే విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం మీ సొంతం. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగా ఉండే మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని ఈరోజు టాప్-5లో నిలబెట్టిందని చెప్పారు బిగ్ బాస్. దీంతో ప్రేక్షకుల ప్రేమే తనని ఇక్కడి వరకు తీసుకువచ్చిందని కన్నీళ్లతో తనూజ కృతజ్ఞతలు తెలిపింది. ఒక కన్నడ అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం మామూలు విషయం కాదని, ఆమె జర్నీ స్పష్టం చేసింది.

 

 'శెభాష్' అనిపించుకున్న యోధుడు!

మరోవైపు, సీజన్ ఆరంభం నుండి ఎన్నో విమర్శలు, తిట్లు ఎదుర్కొన్న పవన్.. ఎట్టకేలకు బిగ్ బాస్ నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు. పవన్ జర్నీ వీడియో చూస్తుంటే అతను పడ్డ కష్టం, శ్రమ కళ్లకు కట్టినట్లు కనిపించాయి. బిగ్ బాస్ పవన్‌ను కొనియాడుతూ.. మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ, తల్లి ఆశీస్సులతో ఈరోజు టఫెస్ట్ కాంపిటీటర్‌గా నిలిచారు అని పొగిడారు. ఈ మాటలతో పవన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. సీజన్ అంతా రఫ్ అండ్ టఫ్‌గా కనిపించిన పవన్, తన జర్నీ చూసి చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కదిలించింది.

 

విన్నర్ రేసులో ఎవరు?

ప్రస్తుతం టాప్-5లో తనూజ, పవన్, ఇమ్మాన్యుయేల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం పవన్ , తనూజ మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గడిచిన 100 రోజుల్లో వీరు చూపించిన ఓర్పు, పోరాట పటిమ ఈ జర్నీ వీడియోల ద్వారా మరోసారి రుజువైంది. ముగింపు దశకు చేరుకున్న ఈ షోలో, ఈ మూడు రోజులు ఇంటి సభ్యులకు ఒక పిక్నిక్ లాంటి అనుభూతిని ఇస్తున్నాయి. మరి ఈ సీజన్ 'కింగ్' లేదా 'క్వీన్' ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే!..