పాపం అంగన్ వాడీ కుక్.. తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లలను కాపాడి మరణించింది

 పాపం అంగన్ వాడీ కుక్.. తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లలను కాపాడి మరణించింది

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్ గ్రామంలో జరిగిన సంఘటన మానవత్వానికి, నిస్వార్థ త్యాగానికి నిదర్శనంగా నిలిచింది. ఒక సామాన్య అంగన్‌వాడీ వంట మనిషి.. తన ప్రాణాలను పణంగా పెట్టి సుమారు 20 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడింది. అయితే చివరికి ప్రాణాలు కోల్పోవటం అందరినీ బాధకు గురిచేస్తోంది. కాంచన్ బాయి మేఘ్వాల్ అనే మహిళ త్యాగం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఆ సమయంలో ఆమె చూపిన సమయస్ఫూర్తి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మాడవడ పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులంతా ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తేనెటీగలు దాడి చేశాయి. ప్రమాదాన్ని గమనించిన కాంచన్ బాయి.. క్షణం కూడా ఆలోచించకుండా పిల్లలను కాపాడేందుకు రంగంలోకి దిగింది. తన ప్రాణం పోతుందనే భయం లేకుండా.. అక్కడ ఉన్న టార్పాలిన్ షీట్లు, చాపలను తీసుకుని ఒక్కో బిడ్డను వాటిలో చుట్టి సురక్షితంగా లోపలికి చేర్చింది. ఈ క్రమంలో తేనెటీగలు ఆమెపై విరుచుకుపడ్డాయి. వందలాది తేనెటీగలు ఆమెను కుడుతున్నా.. చివరి బిడ్డ వరకూ అందరూ క్షేమంగా లోపలికి వెళ్లే వరకు ఆమె వెనకడుగు వేయలేదు. తన శరీరాన్నే కవచంగా మార్చి ఆ చిన్నారులను కాపాడింది.

పిల్లలందరూ సురక్షితంగా లోపలికి వెళ్లిన తర్వాత కాంచన్ బాయి స్పృహ తప్పి పడిపోయింది. గ్రామస్తులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె శరీరంలోకి తేనెటీగల విషం విపరీతంగా చేరడంతో వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆమె మృతదేహంపై ఉన్న లెక్కలేనన్ని తేనెటీగల కాట్లు, ఆమె ఎంతటి భయానక పోరాటం చేసిందో సాక్ష్యంగా నిలిచాయి. కాంచన్ బాయి పక్షవాతంతో ఉన్న భర్తకు, ముగ్గురు పిల్లలకు ఆమె ఏకైక ఆధారం. ఒక స్వయం సహాయక సంఘానికి అధ్యక్షురాలిగా ఉంటూ గ్రామంలో అందరితో ఆత్మీయంగా ఉండేది.

ఆమె పార్థివ దేహం గ్రామానికి చేరుకున్నప్పుడు రణ్‌పూర్ వాసులంతా మౌనంగా నివాళులర్పించారు. పేద వంట మనిషి తన ప్రాణాల కంటే ఇతరుల బిడ్డల ప్రాణాలే ముఖ్యం అనుకోవడం ఆమెలోని గొప్పతనాన్ని చాటిచెప్పింది. అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో ఉన్న ఆ భారీ తేనెతుట్టెను వెంటనే తొలగించాలని.. అలాగే ప్రాణాలు కోల్పోయిన కాంచన్ బాయి కుటుంబానికి ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.