హైదరాబాద్: హైదరాబాద్లో ఒక ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగి రోజుకు 16 గంటలు పనిచేయిస్తున్నారని తను పనిచేస్తున్న కంపెనీపై తెలంగాణ కార్మిక శాఖకు ఫిర్యాదు చేశాడు. ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నా తనకు అందుకు తగిన మొత్తాన్ని చెల్లించడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను పనిచేసిన ఎక్కువ పని గంటలకు పరిహారం ఇప్పించాలని కోరాడు. ఈ కంప్లైంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అందుకు కారణం లేకపోలేదు.
మన దేశం వృద్ధి చెందాలంటే ఎక్కువ పని గంటలు ఉద్యోగులు కష్టపడాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి పలు మార్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యక్తం చేసిన ఈ అభిప్రాయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. వెట్టి చాకిరి చేయించుకునేందుకు ఇలాంటి కబుర్లు చెప్పే యాజమాన్యాలు.. ఉద్యోగులకు వేతనాల పెంపు గురించి ఆలోచన చేయడంలో మాత్రం దాటవేత థోరణిని అవలంబిస్తున్నాయని ఉద్యోగులు మండిపడ్డారు.
ఉన్నపళంగా లేఆఫ్స్ చేస్తున్న కంపెనీలు ఇలాంటి నీతి సూక్తులు చెప్పడం.. దేశ ప్రగతి.. పురోగతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఐటీ ఉద్యోగ సంఘాలు నారాయణ మూర్తి అభిప్రాయంపై పెదవి విరిచాయి. ఈ ఎక్కువ పని గంటలపై ఫిర్యాదు చేసిన సదరు MNC కంపెనీ ఉద్యోగి శ్రీధర్ మేరుగు ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించాడు. తనకు అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకూ లేట్ నైట్ షిఫ్ట్లు చేయించి తనను సదరు సంస్థ ఇబ్బందిపెట్టిందని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.
మూడు, నాలుగు నెలలైతే తనతో రోజుకు 16 గంటల పాటు పనిచేయించుకున్నారని.. ఉద్యోగుల కొరత ఉందని.. చేయక తప్పదని కంపెనీ హుకుం జారీ చేసిందని శ్రీధర్ చెప్పాడు. ఓవర్ టైం చేసినందుకు చెల్లించమని అడిగితే.. ఈ అంశం లేవనెత్తినందుకు తనకు పే చేయకపోగా.. వారం రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేశారని ఈ 45 ఏళ్ల వయసున్న ఐటీ ప్రొఫెషనల్ ఆవేదన వ్యక్తం చేశాడు. అమెరికాకు చెందిన ఈ ఐటీ కంపెనీ మన దేశంలోని ప్రముఖ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని.. ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు ఓవర్ టైం మొత్తాన్ని ఇప్పించాలని శ్రీధర్ కోరాడు.
