IND vs SA: సౌతాఫ్రికాతో ఐదో టీ20.. 9 ఏళ్ళ విరాట్ కోహ్లీ రికార్డుపై అభిషేక్ కన్ను

IND vs SA: సౌతాఫ్రికాతో ఐదో టీ20.. 9 ఏళ్ళ విరాట్ కోహ్లీ రికార్డుపై అభిషేక్ కన్ను

టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది అభిషేక్ పరుగుల ప్రవాహం పారించాడు. 2025 ప్రారంభంలో ఇంగ్లాండ్ పై సెంచరీ చేసిన అభిషేక్.. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ లో నిలకడగా ఆడాడు. ఆసియా కప్ లో అత్యధిక పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న ఈ పంజాబ్ వీరుడు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ లోనూ టాప్ స్కోరర్ గా నిలిచి మరో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లో ఎన్నో ఘనతలు సాధించిన అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ నెలకొల్పిన 9 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసేందుకు సై అంటున్నాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

2025లో అభిషేక్ శర్మ 40 టీ20ల్లో 41.26 యావరేజ్ తో 1,568 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ శర్మ సౌతాఫ్రికాతో జరగబోయే చివరిదైన ఐదో టీ20లో 47 పరుగులు చేస్తే ఒక క్యాలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. టీ20 క్రికెట్ లో 2016లో కోహ్లీ 31 మ్యాచ్ ల్లో 89.66 యావరేజ్ తో 1,614 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో కోహ్లీ ఖాతాలో నాలుగు సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ ఐపీఎల్ లో 973 పరుగులు చేసి ఒకే సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ తన పేరిట ఉంచుకున్నాడు. 

ఓవరాల్ గా టీ20 క్రికెట్‌లో ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ పేరిట ఉంది. పూరన్ 2024లో 76 మ్యాచ్‌ల్లో 2331 పరుగులు చేశాడు. ఆ రికార్డు అభిషేక్ కు అందుకోవడం అసాధ్యం అయినప్పటికీ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో అభిషేక్ శర్మ తడబడుతున్నాడు. తొలి రెండు టీ20 మ్యాచ్ ల్లో విఫలమైన అభిషేక్.. మూడో టీ20లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది ఒకటే టీ20 మ్యాచ్ మిగిలి ఉండడంతో అభిషేక్ 47 పరుగులు చేస్తాడో లేదో చూడాలి.