భారతీయ సంగీతం ఆశా భోస్లే అస్తమయంతో మూగబోయింది. ఆశా భోస్లే పేరు భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. లతా మంగేష్కర్, ఆశా భోస్లే.. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు భారతీయ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణులు. లతా మంగేష్కర్ 2022లో కన్నుమూశారు. ఆశా భోస్లే 2026 ఏప్రిల్ 12న 92 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోయినా ఆమె సుమధుర గాత్రం మనతోనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఆశా భోస్లే పాటలు శ్రోతల చెవుల్లో అమృత వర్షం కురిపిస్తూనే ఉంటాయి.
అయితే.. ఆశా భోస్లే జీవితంలో మధురానుభూతులు మాత్రమే కాదు మానసికంగా ఆమెను కుంగదీసిన చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆశా భోస్లే కూతురు వర్ష భోస్లే 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ట్రాజెడీ ఆశా భోస్లేను మానసికంగా కుంగిపోయేలా చేసింది. కన్న కూతురి మరణం.. పైగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం.. ఇంతకు మించిన కడుపు కోత తల్లిదండ్రులకు ఏముంటుంది..? ఈ పరిణామం ఆశా భోస్లే వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వర్ష భోస్లే లైసెన్స్డ్ రివాల్వర్తో తన తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
►ALSO READ | హృదయ విదారక ఘటన.. సీమంతం రోజే గర్భిణీ స్త్రీపై దాడి.. కవలలు మృతి
అక్టోబర్ 8, 2012న ఉదయం 10:30 గంటలకు, భోస్లే డ్రైవర్ ఆమెను లివింగ్ రూమ్‌లోని సోఫాలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. ఆమె మృతదేహాన్ని చూసి.. ఆ విషయాన్ని అందరికీ మొదటగా చెప్పింది ఆశా భోస్లే డ్రైవరే. అయితే.. ఈ సమయంలో ఆశా భోస్లే సింగపూర్‌లో ఉన్నారు. వర్ష చనిపోయిన విషయాన్ని ఆమెకు ఇండియాకు తిరిగొచ్చేంత వరకూ చెప్పకూడదని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కానీ ఆమె కుమారుడు ఆనంద్ మాత్రం ఈ విషయం ఆమెకు తెలిస్తేనే మంచిదని భావించారు. ఆ వార్త వినగానే ఆశా భోస్లే కుప్పకూలిపోయారు. వర్షా భోస్లే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా డిప్రెషన్ కు లోనై చనిపోయిందని చెబుతుంటారు గానీ ఇప్పటికీ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషయంలో స్పష్టత లేదు.
వర్ష ఫ్రీలాన్స్ స్పోర్ట్స్ రైటర్ అయిన హేమంత్ కెంకరేను పెళ్లి చేసుకుంది. వారి వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు రావడంతో పెళ్లైన కొన్నాళ్లకే విడిపోయారు. విడాకుల తర్వాత.. వర్ష భోస్లే ఆమె తల్లి ఆశా భోస్లేతోనే కలిసి ఉండేది. విడాకులు, కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ఈ పరిణామాలతో ఆశా భోస్లే కూతురు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. 2008లో వర్ష నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఆ సమయంలో వైద్యులు ఆమెను కాపాడారు.
