హవేరి: కర్ణాటకలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. హవేరి జిల్లాలోని సవనూర్ తాలూకాలోని అల్లిపుర గ్రామంలో గర్భిణి స్త్రీ కడుపులో మోస్తున్న కవల బిడ్డలను కోల్పోయింది. తీసుకున్న అప్పును తిరిగివ్వాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబంపై వడ్డీ వ్యాపారి, అతని కుటుంబం దాడి చేశారు. గర్భిణి అనే కనీస కనికరం లేకుండా ఆ తల్లి కడుపుపై తన్నడంతో నెలల నిండకుండానే పిల్లలకు జన్మనివ్వడంతో కవల పిల్లలు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోయారు.
వైద్యులు బాధితురాలి ప్రాణాన్ని కాపాడారు. ఆరు నెలల వయసున్న కవలలు మరణించడంతో ఈ ఘటన బాధిత కుటుంబంలో పెను విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్లిపుర గ్రామానికి చెందిన హలవ్వ అనే మహిళ అదే గ్రామానికి చెందిన సురేష్ లమాని అనే వడ్డీ వ్యాపారి దగ్గర రూ. 30 వేలు అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత ఊళ్లోకి తిరిగి రాలేదు.
మార్చి 28న కూతురి సీమంతం కావడంతో ఊరికి తిరిగొచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చిన సురేష్, అతని కుటుంబ సభ్యులు గొడవ చేశారు. డబ్బులు ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిందేనని లొల్లి చేశారు. అయితే తీసుకున్న డబ్బులు కూతురి సీమంతం అయ్యాక వడ్డీతో సహా తిరిగిస్తానని.. కాస్త సమయం ఇవ్వాలని బాధిత మహిళ కోరింది. సదరు మహిళ వేడుకున్నా సురేష్, అతని కుటుంబం పట్టించుకోలేదు. హలవ్వపై దాడికి దిగారు. తల్లి హలవ్వపై దాడిని చూసిన ఆమె కూతురు.. ఆరు నెలల గర్భంతో ఉన్న పవిత్ర తల్లిపై దాడిని అడ్డుకోబోయింది.
►ALSO READ | ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. పరిస్థితి విషమం
గర్భవతి అనే జాలి కూడా లేకుండా పవిత్ర కడుపుపై తన్ని దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. పవిత్రను స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పవిత్రను మార్చి 28న జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా, ఏప్రిల్ 7న నెలలు నిండకముందే కవల పిల్లలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తూ పుట్టిన కొన్ని గంటల్లోనే ఇద్దరూ చనిపోయారు. ఈ దాడి ఘటనలో బాధిత కుటుంబం నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేష్ లమాని, పరశురామ్ లమాని, మహేష్ లమాని, సక్కుబాయి లమాని అనే నలుగురిపై సవనూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
