- తండ్రికి గాయాలు
ఖమ్మం రూరల్, వెలుగు : కొడుకును ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ చేసేందుకు కారులో వెళ్తుండగా డీసీఎం ఢీకొట్టడంతో యువకుడితో పాటు తల్లి చనిపోగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై దంసలాపురం వద్ద గురువారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి పాపబత్తిని నరసింహారావు కొడుకు పవన్ కుమార్ (17)కు హైదరాబాద్ లో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. అతడిని కాలేజీలో జాయిన్ చేసేందుకు గురువారం భార్య సుజాత (38)తో కలిసి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై దంసలాపురం వద్దకు రాగానే.. సూర్యాపేట వైపు నుంచి వస్తున్న డీసీఎం కారును ఢీ కొట్టింది.
ప్రమాదంలో సుజాత, పవన్ అక్కడికక్కడే చనిపోగా.. కారు నడుపుతున్న నరసింహారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని నరసింహారావును హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఎచ్ ఓ రాజు తెలిపారు.
