న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లోని విలువైన 46 ఎకరాల భూముల వేలం, సర్వే వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇంప్లీడ్ అయ్యేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై వారం రోజుల పాటు యథాతథ స్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీఐఐసీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తమను పక్షంగా చేర్చకుండా, వాదనలు వినకుండానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని టీజీఐఐసీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తరపు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ.. సర్వే, వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది.. 2008 నాటి ఉత్తర్వులు ఇప్పటికే రద్దయ్యాయని, హైకోర్టులో ఇంప్లీడ్ కాకుండానే టీజీఐఐసీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. సర్వే, వేలాన్ని నిలిపివేయాలని నేరుగా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. హైకోర్టులోనే ఇంప్లీడ్ అయ్యి అభ్యంతరాలు తెలియజేసేందుకు టీజీఐఐసీకి అవకాశం కల్పించింది.
