సహారా ఖాతాదారుల డబ్బులను తిరిగి చెల్లించండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సహారా ఖాతాదారుల డబ్బులను తిరిగి చెల్లించండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     ఏజెంట్ల పీఎఫ్‌‌‌‌లు, వారి భవిష్యత్‌‌‌‌కు కేంద్రానిదే బాధ్యత: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద సహారా బాధితుల ఆందోళనకు సంఘీభావం 

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా లక్షలాది మంది సహారా డిపాజిటర్లు, ఏజెంట్లు, మద్దతుదారుల కష్టార్జిత సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఈ వివాదానికి పరిష్కారం చూపాలని కోరారు. గురువారం ఢిల్లీ జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌లోని సహారా బాధితులు చేపట్టిన ఆందోళనలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొని, వారికి పూర్తి సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా ఖాతాదారుల డబ్బులను వెంటనే వారి అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అలాగే, 15 లక్షల మంది ఏజెంట్ల పీఎఫ్ చెల్లింపుతో పాటు వారికి ఉపాధి కల్పించి భవిష్యత్‌‌‌‌పై భరోసా కల్పించాలన్నారు. 2012లో సహారాపై నమోదైన కేసుతో వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 14 ఏండ్లుగా ఈ కేసు సుప్రీకోర్టులో నడుస్తున్నా... పరిష్కారం వైపు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. అందువల్లే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాల జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయన్నారు.
 
అమిత్‌‌‌‌ షా దృష్టి పెట్టాలి..

ఈ వ్యవహారం కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పరిధిలో ఉందని, దీనిపై ఆయనదృష్టి పెట్టాలని వంశీకృష్ణ అన్నారు. ఎన్నో ఏండ్లుగా తమ సొంత డబ్బు కోసం ఎదురుచూస్తున్న డిపాజిటర్ల సమస్యను పరిష్కరించడం అత్యవసరమని, వారి సొమ్మును తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, అన్యాయానికి గురైన ప్రతి వర్గానికి అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. ఎంపీ వంశీకృష్ణ తమకు సంఘీభావం తెలపడం మరింత ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించిందని సహారా బాధితులు అభిప్రాయపడ్డారు.